ఈ తరానికి తెలియని కోడెల జీవితం.. గిన్నిస్ బుక్ లో స్థానం!!

 

మనం చూసేది, వినేది అంతా నిజం కాదు. మనకి తెలిసిన కథ వెనక, మనకి తెలియని మరో కథ కూడా ఉంటుంది. దానినే నాణేనికి మరోవైపు అంటారు. కోడెల కథ కూడా అలాంటిదే. ఇటీవల ఆయన మీద ఎన్నో ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు మంచి నాయకుడిగా ఓ వెలుగు వెలిగిన ఆయన.. కొంతకాలంగా వరుస ఆరోపణలు చుట్టుముట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకొని మరణించారు.

అప్పట్లో పల్నాడు ఫ్యాక్షనిస్టు రాజకీయాలకు అడ్డాగా ఉండేది. కొందరు నాయకులు తమ స్వార్థ రాజకీయాల కోసం ఎందరో ప్రాణాలను బలితీసుకునేవారు. మరోవైపు కోడెల డాక్టర్ గా సేవలందిస్తూ.. వందల మందికి ప్రాణదానం చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. 1982లో ఎన్‌టీఆర్‌ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన కోడెల అంచెలంచెలుగా ఎదిగి తిరుగులేని నేతగా ఎదిగారు. కోడెల రాజకీయ రంగ ప్రవేశమే ఓ సంచలనం. నరసరావుపేట అంటే మాజీ సీఎం కాసు బ్రహ్మానందరెడ్డికి కంచు కోట. ఆ కంచుకోటలో ఆయనను ఎదిరించి, ఓడించి సంచలనం రేపిన ఘనత కోడెలదే. 

నిజానికి డాక్టర్ గా ఉన్న సమయంలో కోడెల సౌమ్యంగా ఉండేవారట. కానీ అక్కడి రాజకీయ పరిస్థితులు, ఫ్యాక్షనిస్టు రాజకీయాలను ఢీకొట్టడానికి కోడెల పంథా మార్చుకున్నారట. ఆయన తెగింపు, ధైర్యం చూసి ప్రత్యర్థులు భయపడేవారట. ఆ ధైర్యమే ఆయనను తిరుగులేని నేతను చేసింది అంటారు. 1983 నుంచి 1999 వరకూ వరసగా ఐదు సార్లు నరసరావుపేట నుంచే ఎమ్మెల్యేగా ఎన్నికై కోడెల రికార్డు సృష్టించారు. 2014 ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజక వర్గం నుంచి ఆరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో ఆయన ఎన్నో పదవులు చేపట్టారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, స్పీకర్ గా విశేష సేవలందించారు.

అయితే కొంతకాలంగా వరుస వివాదాలతో ఆయన సతమతమయ్యారు. ఆయన కొడుకు, కూతురు కే-టాక్స్ పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టేవారని ఆరోపణలు వచ్చాయి. వారిద్దరి మీద కేసులు కూడా నమోదయ్యాయి. అప్పటినుంచి కోడెల మీద విమర్శలు మొదలయ్యాయి. వీటికితోడు పలు ఆరోపణలు ఆయనను చుట్టుముట్టాయి. ఆ ఆరోపణలు ఆయన ప్రస్థానాన్ని మసకబారేలా చేసాయి. ఆయన దశాబ్దాల కృషితో తెచ్చుకున్న పేరుని, ఆయన సంతానం కొద్ది రోజుల్లోనే పోగొట్టిందని సీనియర్ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కొంత కాలంగా మీడియా, సోషల్ మీడియాలో కోడెల గురించి పలు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో కోడెల గురించి పూర్తిగా తెలియని ఈ తరం వారు.. ఆయన మీద విమర్శలు గుప్పించారు. కానీ కోడెల గురించి తెలిసిన సీనియర్లు మాత్రం కోడెల సేవలను గుర్తుతెచ్చుకొని.. కోడెల ప్రస్థానానికి పడిన మచ్చని, ముంగింపుని తలుచుకొని బాధపడుతున్నారు. ముఖ్యంగా నరసరావుపేట వాసులు కోడెల సేవలను గుర్తుతెచ్చుకొని నివాళులర్పిస్తున్నారు.

కోడెలని నరసరావుపేట లోని ప్రత్యర్థి వర్గం సైతం డాక్టర్ గారు అని సంబోధించటం సర్వ సాధారణం. ఆయన పై రాజకీయంగా అనునిత్యం ఆరోపణలు చేసే వారు సైతం ఆయన పని తనం గురించి, ఆయన కష్టించే తత్వం గురించి, ఆయన చేసిన అభివృద్ధి గురించి రాజకీయంగా బయటకి మాట్లాడలేకపోయినా.. నాలుగు గోడల మధ్య మాత్రం ఆయన నరసరావుపేటలో చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుతారు.

రాష్ట్రంలో ఎన్ని ఊళ్ళల్లో రెండు పూటలా మంచి నీరు వస్తాయో లేదో తెలియదు కానీ.. కోడెల హయాంలో సీజన్లతో సంబంధం లేకుండా నరసరావుపేట ప్రజలు రెండు పూటలా మంచి నీరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందుకున్నారు. అలాగే కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణం పేరుతో నరసరావుపేటలో ఆయన నిర్మించిన స్టేడియం రాష్ట్రంలో పెద్ద నగరాల్లో కూడా లేవు అంటే అతిశయోక్తి కాదు. జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి ఆటలపోటీలు ఆ క్రీడాప్రాంగణంలో జరిగాయి అంటే అది కేవలం ఆయన కృషి ఫలితమే. అలానే టౌన్ హాల్.. అత్యంత సుందరంగా నరసరావుపేట ప్రజలకు అతి తక్కువ రుసుముతో ఎటువంటి కార్యక్రమాలు అయినా చేసుకునే విధంగా ఆయన నిర్మించిన భువనచంద్ర టౌన్ హాల్ చూసినప్పుడు ఆయనను గుర్తు చేసుకోని నరసరావుపేట వాసి ఉండరు. అలానే పార్కులను తలపించే విధంగా స్మశాన వాటికలు నిర్మింప చేసిన ఆయన్ని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రం లో చాలా నియోజకవర్గాలు ఆ దారిలో నడిచాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఎంతో పేరు ఉన్న మహిమాన్విత శైవక్షేత్రం అయిన కోటప్పకొండ పేరు తలచిన వెంటనే కోడెల గుర్తుకు వస్తారు అనేది పార్టీలకి అతీతంగా అందరూ ఒప్పుకునే మాట. ఆయన కోటప్పకొండ అభివృద్ధి కోసం పడిన తపన.. ఒకప్పటి కోటప్పకొండ ఇప్పటి కోటప్పకొండని చూసిన వారెవరయినా చెబుతారు.

ఉమ్మడి ఏపీలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి మంత్రిగా పనిచేసిన కోడెల డ్వాక్రా సంఘాల ఏర్పాటుకు విశేష కృషి చేశారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా గ్రామాల్లో, పట్టణాల్లో డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేయించారు. 1987లో హోంమంత్రిగా పనిచేసిన ఆయన ‘మైత్రి సదస్సులు’ నిర్వహించి వార్తల్లోకి ఎక్కారు. పోలీసు హౌసింగ్‌ స్కీమ్‌ అమలు చేసిన ఘనత కూడా కోడెలకే దక్కింది.

ఒక డాక్టర్ గా అవయవ దానం మీద అవగాహన కల్పించే సత్సంకల్పంతో ఆయన ఇచ్చిన పిలుపుని అందుకొని కొద్దీ గంటల సమయంలోనే పది వేలకు పైగా ప్రజలు అవయవదానం చేయటానికి అంగీకార పత్రం ఇచ్చిన సంఘటన గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించింది అంటే ఆయన పడే తపన ఏంటో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇలా తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో సేవలు చేసి, ఎంతో పేరు తెచ్చుకున్న ఆయన మీద.. ఇటీవల కొన్ని ఆరోపణలు రావడంతో.. ఆయన మీద విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ లోకాన్ని విడిచారు. కానీ కోడెల చేసిన సేవలు మాత్రం ఎప్పటికీ ప్రాంత ప్రజల్లో నిలిచే ఉంటాయి.