ఏపీ ప్రతిపక్షానికి ధన్యవాదాలు - కోడెల

 

ఏపీలో ఆఖరి అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. ఈ సందర్బంగా శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అసెంబ్లీలో మాట్లాడారు. స్పీకర్ గా తనకు అవకాశం రావడం గొప్ప విషయం అని కోడెల అన్నారు. తాను ఏకగ్రీవంగా ఎన్నికవడానికి సహకరించిన ప్రతిపక్షాలకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. స్పీకర్ అంటే ఉగాది పచ్చడి లాంటి ఉద్యోగమని అన్నారు. ఈసారి మహిళా పార్లమెంట్‌ వంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు నిర్వహించామన్న కోడెల.. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య ఎంతో బాధించిందని చెప్పారు. సభ్యులపై అనర్హత విషయంలో అనేక ప్రశ్నలు వచ్చినా.. సభ జరిగిన తీరుపై ప్రజల నుంచి ప్రశంసలు వచ్చాయని కోడెల చెప్పారు. ప్రతిపక్షం సభకు రాకపోవడం కూడా ఆవేదన కలిగించిందని..సభ్యులు రాకపోవడం దురదృష్టకరమని అన్నారు. దేవాలయంలోకి పురోహితుడు వెళ్లినట్లు తాను సభకు వచ్చానని చెప్పారు. పార్టీ మారిన వారి పై చర్యల విషయాన్ని సభ్యుల విచక్షణకు వదిలేశామన్న ఆయన.. ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ సంప్రదాయం ఉందన్నారు. సభ్యులందరూ గెలిచి మళ్లీ సభకు రావాలని కోరుకుంటున్నానని.. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగా రావాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. నేటితో ఏపీ 32వ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. 2019 ఎన్నికల అనంతరం మరలా 33 వ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి.