అసెంబ్లీ ఫర్నీచర్‌ని ఇంటికి తీసుకెళ్లిన కోడెల.. చర్యలు తప్పవా?

 

ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్‌, టీడీపీ సీనియర్‌ నేత కోడెల శివప్రసాదరావు వరుస వివాదాల్లో చిక్కుకుంటూ విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో కోడెల కుటుంబం.. కే టాక్స్ పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టిందని ఆరోపణలు వచ్చాయి. కోడెల కొడుకు, కూతురు మీద పలు కేసులు కూడా నమోదయ్యాయి. వీటి నుంచి ఇంకా బయటపడకముందే కోడెల మరో వివాదంలో చిక్కుకున్నారు. అసెంబ్లీ ఫర్నీచర్ ని సొంత ఫర్నీచర్ లా ఇంటికి తీసుకెళ్లడంపై కోడెల మీద విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఏపీ అసెంబ్లీలో ఫర్నీచర్ మాయమంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఈ అంశంపై కోడెల తాజాగా స్పందించారు. అసెంబ్లీ ఫర్నీచర్‌ని తన ఇంటికి తెచ్చుకున్నది వాస్తవమేనని అంగీకరించారు. హైదరాబాద్ నుంచి అమరావతికి సామాన్లు తరలించేటప్పుడు.. కొంత ఫర్నీచర్ ను తాను వినియోగించుకున్నట్లు స్పష్టం చేశారు. ఫర్నీచర్ తీసుకువెళ్లాలని అసెంబ్లీ అధికారులకు తాను లేఖ కూడా రాశానని కోడెల గుర్తు చేశారు. కానీ అసెంబ్లీ అధికారులు ఇప్పటి వరకు స్పందించలేదన్నారు. ఇప్పుడైనా అధికారులు వస్తే ఫర్నీచర్ అప్పగిస్తానని.. లేకపోతే ఎంత ఖర్చు అయ్యిందో చెబితే చెల్లిస్తానని కోడెల చెప్పారు.

కోడెల అసెంబ్లీ ఫర్నీచర్‌ని ఇంటికి తీసుకెళ్లడంపై అధికార వైసీపీ విమర్శలు గుప్పిస్తుంది. ఈ విషయంపై మంత్రి కురసాల కన్నబాబు స్పందించారు. ఇది చాలా దారుణమని విమర్శించారు. ఇప్పుడు దీనిపై విచారణ జరుగుతుంది కాబట్టే ఆ ఫర్నీచర్‌ని తిరిగి ఇచ్చేస్తామని అంటున్నారని, ఒకవేళ విచారణ లేకపోతే దాని ఊసే ఉండేది కాదన్నారు. విచారణలో ఆయన తప్పు చేశానని ఒప్పుకుంటే, తప్పు ఒప్పు అవుతుందా అని కన్నబాబు ప్రశ్నించారు. ఇదే పనిని ఒక సామాన్యుడు చేస్తే ఏమంటారు?.. దొంగతనమో, చేతివాటమనో అనేవారని విమర్శించారు. ఫర్నీచర్‌ను ఇంటికి తీసుకెళ్లడంపై కోడెలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కన్నబాబు స్పష్టం చేశారు.