వెన్నుచూపని ధీరుడు కోడెల... నిజంగా పల్నాడు పులే...

 

తన చిన్నతనంలో అనారోగ్యంతో తోబుట్టువుల్లో ఒకరు చనిపోవడం కలిచివేయడంతో ఒక లక్ష్యంగా వైద్య విద్యను అభ్యసించి, చేయి తిరిగిన సర్జన్ గా ఎంతోమందికి తన చేతులతో ప్రాణాలు పోశారు కోడెల. కేవలం ఒక్క రూపాయికే వైద్యం అందిస్తూ నిరుపేదల మనసులను గెలుచుకున్నారు. కోడెల చేయి పడితే చాలు రోగం పోతుందనే విధంగా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే వైద్య వృత్తిలో కోడెల ఎన్నో అద్భుతాలు చేశారు. చేయి తిరిగిన సర్జన్ గా రోగాలను, రోగులను, సమాజాన్ని చదివిన కోడెల... రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. తనంతట తానుగా కాకుండా, తనకున్న మంచి పేరును గుర్తించి స్వయంగా ఎన్టీఆర్ కోరడంతో రాజకీయాల్లోకి వచ్చిన కోడెల.... అప్పటికే మర్రిచెట్టులా వేళ్లానుకుపోయున్న కాసు ఫ్యామిలీని ఢీకొట్టి పల్నాడు పులిగా ఎదిగారు. 1983 నుంచి 1999 వరకు వరుసగా ఐదుసార్లు నర్సరావుపేట నుంచి గెలిచి రికార్డు సృష్టించారు. ఎమ్మెల్యేగా మొదలైన కోడెల రాజకీయ ప్రస్థానం... మంత్రి పదవులతోపాటు నవ్యాంధ్రప్రదేశ్ మొదటి స్పీకర్ వరకు అత్యున్నత పదవులను చేపట్టారు. 2004, 2009లో ఓడినప్పటికీ వెన్నుచూపని ధీరత్వం కోడెలది. 2014లో పార్టీ అధిష్టానం... నర్సరావుపేటను కాదని, సత్తెనపల్లి నుంచి నిలబెట్టినా గెలుపుని ముద్దాడిన ధీరుడు కోడెల.

ఇక, వైద్య వృత్తిలోనే కాదు రాజకీయాల్లో సేవకు పరమార్థంగా నిలిచారు. ప్రతి పుట్టిన రోజుని ప్రజల్లోనే జరుపుకుంటూ సామూహిక, సమాజహిత కార్యక్రమాలు చేపట్టేవారు. అలా అవయవదానంలో కోడెల గిన్నిస్ రికార్డు సాధించారు. ఒకే రోజు, ఒకే వేదిక మీద నుంచి తన పుట్టిన రోజున దాదాపు 12వేల మందితో అవయవదాన అంగీకార పత్రాలు ఇప్పించి అటు వైద్యుడిగా, ఇటు ప్రజానాయకుడిగా కోడెల ప్రపంచ రికార్డు సృష్టించారు.

అయితే, అందమైన చంద్రుడికీ ఒక మచ్చ ఉన్నట్లే, కోడెలపైనా ఫ్యాక్షనిస్టు ముద్రపడింది. అయినా కోడెల ఎప్పుడూ వెరవలేదు. ఎందుకంటే ప్రజల రక్షణ కోసం ఏ సమస్య వచ్చినా పల్నాడులో ఆయనే ముందుండేవారు. అందుకే, కోడెలను ప్రజలు అభిమానంగా పల్నాడు పులిగా పిలుచుకుంటారు. వ్యక్తిగతంగానూ కోడెల ఎవరికీ భయపడలేదు. ఎంతటి ఉద్ధండులైనా ధైర్యంగా ఎదుర్కొన్నారు. పులిలా ముందుకు ఉరికేవారు. అయితే, తన 37ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొని, ఒత్తిళ్లను అధిగమించిన కోడెల... తన రాజకీయ జీవిత చరమాంకంలో వచ్చిన ఆరోపణలను మాత్రం తట్టుకోలేకపోయారు. రాజకీయ వేధింపులు, దొంగతనం ఆరోపణలు, వరుస కేసులతో విసిగిపోయారు. మరోవైపు పిల్లలపైనా కేసులు పెట్టడంతో కుమిలిపోయారు. చివరికి మానసిక సంఘర్షణను అధిగమించలేక బలవన్మరణానికి పాల్పడి తన అభిమానులను శోకసంద్రంలో ముంచి వెళ్లిపోయారు.