కోడెలకి మిగిలిన ఏకైక మార్గం అదే ?

 

ఏపీ మాజీ స్పీకర్ కోడెల కుటుంబం తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇప్పటికే కోడెల సహా ఆయన కుమారుడు శివరామ్, కుమార్తె విజయలక్ష్మి మీద దౌర్జన్యం, బెదిరింపు లాంటి పలు రకాల విషయాల మీద కేసులు నమోదయ్యాయి. అయితే ఈ విషయం మీద టీడీపీ నుండి ఎటువంటి స్పందనా లేదు. నిజానికి ఈ విషయం మీద ఆ పార్టీ స్పందించకుండా ఉండాలని నిర్ణయించుకున్నట్టు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. మరి అది నిజమో కాదో తెలీదు కానీ ఈ విషయం మీద ఎవరూ పెద్దగా స్పందించలేదు. వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకీ, విమర్శలకీ కోడెల ఒక్కరే సమాధానం చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఒకరకంగా కోడెల కుటుంబం మీద ఉన్న కేసులు గట్టిగా ఉండడం, సాక్ష్యాధారాలు కూడా లభించే అవకాశం అధికంగా ఉండడంతోనే టీడీపీ నేతలు వ్యూహాత్మక మౌనం పాటించారు అనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. దీంతో పార్టీ నుండి తనకి బ్యాకప్ ఉంటుందని భావించిన కోడెల ఆశలు అన్నీ అడియాశలు అవడంతో ఆయన అధినేతను నిన్న కలిశారు.

విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన చంద్రబాబు ఇంటికి వెళ్లిన కోడెల చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ భేటీలో విషయాలు బయటకు రాకున్నా ఈ భేటీ అంతా తనను రక్షించమనే ధోరణిలోనే సాగిందన్న ప్రచారం జరుగుతోంది. అయితే చంద్రబాబు స్పష్టమైన హామీ ఏమీ ఇవ్వలేదని త్వరలో ఈ విషయం మీద అమరావతిలో మళ్ళీ చర్చిద్దామని దాట వేసినట్టు చెబుతున్నారు. ఈ విషయం మీద చంద్రబాబు గుంటూరు జిల్లాలోని ఇతర నేతల నుండి సలాహాలు తీసుకుని అప్పుడు కోడెల విషయంలో ఎలా స్పందించాలి ? ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు.

నిజానికి కోడెల విషయంలో సొంత పార్టీ నేతలు కూడా పాజిటివ్ గా లేరు, ఆయన తనయుడు సాగించిన వసూళ్ళ పర్వం పార్టీలకి అతీతంగా అందరి మీదా, సొంత పార్టీ నేతల మీద మరింత ఎక్కువగా పడడంతో చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు సొంత పార్టీ నేతలు కూడా. ఇక ఇలాంటి సమయంలో కోడెలకి సొంత పార్టీ నేతల సపోర్ట్ కూడా దొరకడం కష్టమే. ఇప్పుడు ఆయనకీ ఉన్న ఏకైక దారి బీజేపీ ! బీజేపీలో చేరిక ఒక్కటే ఆయనకు ఊరటనిస్తుందని భావిస్తున్నారు విశ్లేషకులు. ఇప్పటికే సౌత్ లో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ సత్తా ఉన్న నాయకులని ప్రలోభాలకి గురి చేసి అయినా పార్టీలోకి చేర్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపధ్యంలో కోడెల బీజేపీ వైపు చూసే అవకాశం లేకపోలేదు. అయిరతే మరి ఆయన బీజేపీలో చేరతానంటే ఆ పార్టీ చేర్చుకుంటుందా ? ఒక వేళ చేర్చుకుంటానని అంటే ఏమి కారణం చెప్పి టీడీపీ వీడి బీజేపీ వైపు చూస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.