ప్రభుత్వ లాంఛనాలు అక్కర్లేదు: కోడెల ఫ్యామిలీ

 

టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి తెలిసిందే. ఆయన అంతిమ సంస్కారాల్ని ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. అయితే.. కోడెల కుటుంబం మాత్రం ప్రభుత్వ లాంఛనాలు తిరస్కరించింది. కోడెల అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరపొద్దని, పార్టీ అభిమానుల మధ్యే జరపాలని కోడెల కుటుంబసభ్యులు, టీడీపీ నేతలు నిర్ణయించారు. ఈ విషయాన్ని టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు తెలియజేశారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగేటట్లయితే అభిమానులు, కార్యకర్తలు, నాయకులు ఇబ్బందిపడతారని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. కోడెల ఆత్మహత్యకు కారణం వైసీపీ ప్రభుత్వం పెట్టిన వేధింపులేనని టీడీపీ నేతలు, కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అందుకే ప్రభుత్వ లాంఛనాలు అక్కర్లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది.