రాజకీయ వేధింపులా? తలవొంపుల భారమా? కోడెల ఆత్మహత్యకు అసలు కారణాలేంటి?

 

తిరుగులేని నేతగా, ఎదురులేని నాయకుడిగా ఎదిగిన కోడెల శివప్రసాద్‌రావుకు మొన్నటి ఎన్నికల నుంచే గడ్డుకాలం మొదలైంది. ఏప్రిల్‌ 11న పోలింగ్‌ రోజున సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఇనెమట్ల గ్రామస్తులు కోడెలపై ఎదురుతిరిగారు. ఇనెమట్ల పోలింగ్‌ బూత్‌లో రిగ్గింగ్‌ చేస్తున్నారన్న అభియోగంతో కోడెలపై దాడికి దిగారు. చొక్కా చింపిమరీ దారుణంగా పిడిగుద్దులు కురిపించారు. దాంతో అప్పటికే ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, అనేక ఉన్నత పదవులు అధిష్టించి, 35ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగిన కోడెల... ఆ ఘటనతో మానసికంగా కుంగిపోయారు. అనంతరం ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడం, తాను సైతం ఘోర పరాజయం పాలవడంతో కోడెల మరింత కుంగిపోయారు. అయితే, వైసీపీ అధికారంలోకి వచ్చి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో, రాజకీయంగా కొంత ఇబ్బంది తప్పదని భావించారు. కానీ అనూహ్యంగా అసెంబ్లీ ఫర్నిచర్ దొంగలించారంటూ అభియోగాలు రావడం, కేసులు నమోదు కావడంతో కోడెల తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. అదే సమయంలో కొడుకు శివరామ్, కూతురు విజయలక్ష్మిపై అనేక ఆరోపణలు రావడం, కేసులు నమోదు కావడంతో కోడెల కుమిలిపోయారు. అప్పటివరకు తాను సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు దెబ్బతినడంతో కోడెల తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారు. కేవలం మూడ్నెళ్లలో జరిగిన వరుస పరిణామాలతో కోడెల డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. అసెంబ్లీ ఫర్నిచల్ విషయంలో కోర్టుకు వెళ్లినా ఊరట లభించకపోవడంతో మరింత కుంగిపోయారు. అయితే, పల్నాటి పులిగా పేరు సంపాదించుకున్న కోడెలను ఈ పరిణామాలన్నీ మెలిపెట్టాయి. మానసికంగా అలసిపోయేలా చేశాయ్.

అయితే ఇవన్నీ రాజకీయ వేధింపుల్లో భాగమే అనుకున్నా, తన బాస్ చంద్రబాబు నుంచి కోడెలకు ఆశించిన మద్దతు లభించలేదనే మాట కూడా వినిపిస్తోంది. తన పరిస్థితిపై బాబును కలిసి గోడు వెళ్లబోసుకున్నా, అసెంబ్లీ ఫర్నిచల్ దొంగతనం ఆరోపణలు... కోడెల కొడుకు, కూతురుపై వచ్చిన అభియోగాలతో... వెనకేసుకొచ్చేందుకు చంద్రబాబు కూడా ఇష్టపడలేదని తెలుస్తోంది. మొత్తానికి అసెంబ్లీ ఫర్నిచల్ దొంగతనం ఆరోపణలు కోడెలకు తలవొంపులు తీసుకురాగా... కొడుకు, కూతురుపై వచ్చిన అభియోగాలు కోడెలను మరింత కుంగదీశాయి. చివరికి ఇవన్నీ ఆత్మహత్య చేసుకునేంతవరకు తీసుకొచ్చాయని సన్నిహితులు అంటున్నారు. 

తలదించని వ్యక్తిత్వం... తలవంచని మనస్తత్వం కలిగిన తనను కొన్ని పరిస్థితులు తలదించుకునేలా చేశాయంటూ కోడెల తన సన్నిహితులతో వాపోయినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు తన 35ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి దుస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదంటూ ఆత్మహత్యకు ముందు తన సన్నిహితులతో చెప్పుకున్నట్లు తెలుస్తోంది.