పొన్నాల కోసం కోదండరాం త్యాగం

 

టీఆర్ఎస్ ని గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడినప్పుడు అసలు ఈ కూటమి ఎన్నికల వరకు ఉంటుందా? ముందే ముక్కలవుతుందా? అని పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ కూటమి దూసుకుపోతుంది. కూటమిలోని పార్టీలు, నేతలు త్యాగానికి సిద్దమవుతూ తమ ప్రధాన లక్ష్యం ఏంటో మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తున్నారు. టీడీపీ తక్కువ సీట్లకు సర్దుకుపోయింది. అంతేకాకుండా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కోసం సీటు త్యాగం చేసి పొత్తు ధర్మాన్ని పాటించారు. ఇక సీపీఐ కూడా తక్కువ సీట్లు కేటాయించినా.. టీఆర్ఎస్ ను గద్దె దించడం కోసం కూటమిలోనే కొనసాగుతామని తేల్చి చెప్పింది. ఇక తాజాగా టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం కూడా తనకు వ్యక్తిగత ప్రయోజనాల కంటే కూటమి ప్రయోజనాలే ముఖ్యమని చాటిచెప్పారు.

కాంగ్రెస్ 65 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ జాబితాలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పేరు లేకపోవడంతో అందరూ షాక్ అయ్యారు. పొన్నాల జనగామ నుంచి అనేకసార్లు ప్రాతినిధ్యం వహించారు. ఆయనికి నియోజకవర్గంలో మంచి పట్టుంది. అలాంటి పొన్నాలకు తొలి జాబితాలో టిక్కెట్ దక్కకపోవడంతో ఆయనతో పాటు.. కాంగ్రెస్ శ్రేణులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే పొత్తులో భాగంగా కాంగ్రెస్ ఈ సీటుని టీజేఎస్ కి కేటాయించింది. ఇక్కడి నుంచి కోదండరాం బరిలోకి దిగలనుకున్నారు. కాంగ్రెస్ అధిష్టానం పొన్నాలకు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇస్తామని చెప్పినా.. పొన్నాల మాత్రం జనగామ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికే సుముఖుత వ్యక్తం చేశారు. మరోవైపు బీసీ సీనియర్ నేత అయిన పొన్నాలకు మొండిచేయి చూపడం కరెక్ట్ కాదనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. ఈ వరుస పరిణామాల నేపథ్యంలో కోదండరాం పొన్నాల కోసం సీటు త్యాగం చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.

తాజాగా టీజేఎస్ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. ఈ భేటీలో టీజేఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. జనగాం నుంచి కోదండరాం పోటీ చేయకూడదని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. బీసీలకు అన్యాయం చేయడం తమకు ఇష్టం లేదు కాబట్టి.. కోదండరాం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరి కోదండరాం వేరే ఏదైనా స్థానం పోటీ చేస్తారో లేక కూటమిలోని అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యతను తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తారో చూడాలి. మొత్తానికి కూటమిలోని పార్టీలు, నేతల త్యాగాలు చూస్తుంటే టీఆర్ఎస్ ని ఓడించాలని కూటమి ఎంత బలంగా ఫిక్స్ అయిందో అర్ధమవుతోంది. చూద్దాం కూటమి లక్ష్యం నెరవేరుతుందో లేదో.