ఇంటర్ ఫలితాల అవకతవకల వెనుక టీఆర్ఎస్ పెద్దలు

 

గ్లోబరీనా సంస్థ పుణ్యమా అని తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో గందరగోళం ఏర్పడి రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దాదాపు 20 మంది విద్యార్థులు ఆత్మహత్యకు కూడా పాల్పడ్డారు. తాజాగా ఈ వివాదంపై తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం స్పందించారు. ఇంటర్ ఫలితాల్లో గందరగోళానికి, ఇంటర్ బోర్డులో జరిగిన అవకతవకలకు.. ముగ్గురు టీఆర్ఎస్ పెద్దలే కారణమని కోదండరాం ఆరోపించారు. వారిని కాపాడేందుకు ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని పోలీస్ స్టేషన్ గా మార్చారని మండిపడ్డారు. గ్లోబరీనా సంస్థకు ఇంటర్ విద్యార్థుల డేటాను ఎంటర్ చేసే సామర్థ్యం లేదని కోదండరాం అన్నారు. గ్లోబరీనా సంస్థ విద్యాసంవత్సరం ఆరంభం నుంచి అన్నీ తప్పిదాలే చేస్తోందని విమర్శించారు. ఫీజ్ డిటేల్స్ సిస్టంలో సరిగా ఎంటర్ చేయకపోవడంతో.. ఫీజు తేదీ ముగిసినా ఎంత మంది ఫీజ్ కట్టారో బోర్డ్ కు సమాచారం అందించలేక పోయిందని ఆరోపించారు. విద్యార్థుల ఆన్సర్ షీట్లు ఇచ్చిన తర్వాత కూడా మార్కులు సరిగా ఎంటర్ చేయలేక ఫలితాల వెల్లడికి పదిహేను రోజులు గడువు కోరారని చెప్పారు. గ్లోబరీనా సంస్థను కాపాడేందుకు ఇంటర్ బోర్డు కార్యదర్శి ప్రయత్నిస్తున్నారని కోదండరాం ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, గ్లోబరినాపై చర్యలు తీసుకుని.. బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని కోదండరాం డిమాండ్ చేశారు.