TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

చివరకు కేసీఆర్, జగన్ మిగులుతారు

Published on: Fri May 10, 2019 4:40PM

 

రాష్ట్ర ప్రభుత్వం తలచుకుంటే తెలంగాణ ఇంటర్ ఫలితాల అవకతవకల వ్యవహారం ఒక్క రోజులోనే పరిష్కారమవుతుందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం స్పష్టంచేశారు. ఇంటర్‌ ఫలితాల తీరుపై ముగ్ధూం భవన్‌లో ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో రెండో రోజు కొనసాగుతున్న నిరాహార దీక్షకు ఆయన సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన విద్యాశాఖ మంత్రిని, ఇంటర్‌ బోర్డు కార్యదర్శిని తొలగించాలని డిమాండ్‌ చేశారు. లక్షలాది మంది విద్యార్థులకు అన్యాయం జరిగినా కూడా ప్రభుత్వం ఉలుకూపలుకూ లేకుండా వ్యవహరిస్తోందన్నారు. కనీసం అధికారులు కూడా ఒక్క సమాధానం చెప్పని పరిస్థితిని, సంబంధిత వ్యక్తులపై చర్యలకు పూనుకోని వైనాన్ని గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. గ్లోబరీనా అనే ఒక్క సంస్థను వెనకేసుకు రావడానికి మొత్తం ప్రభుత్వ యంత్రాంగమంతా కృషి చేస్తోందని విమర్శించారు. గ్లోబరీనాను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదన్నారు. ఈ వ్యవహారంలో ఇంటర్‌ బోర్డు ఇంకా బోనులోనే ఉందన్నారు. ఇంటర్ విద్యార్థులకు మద్దతుగా శనివారం ఇందిరా పార్క్ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. అన్ని పక్షాలు ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

రాష్ట్రంలో పాలన పడకేసిందని కోదండరాం ఆరోపించారు. ఫెడరల్ ఫ్రంట్ అనేది అత్యాశ.. అది అయ్యే పని కాదన్నారు. ఫ్రంట్ పేరుతో కేసీఆర్ సమయం వృధా చేయకుండా కీలక సమస్యలపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎండల వేడి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హితవుపలికారు. రెవెన్యూ శాఖలో సమస్యలున్న మాట వాస్తవమన్నారు. సంస్కరణలపై ప్రభుత్వం అన్ని పక్షాలతో మాట్లాడాలని సూచించారు. కాంగ్రెస్, బీజేపీ లేకుండా రెండు సార్లు మాత్రమే కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పడ్డాయని గుర్తుచేశారు. నేషనల్ ఫ్రంట్‌కు బయట నుంచి బీజేపీ మద్దతు ఇచ్చిందని.. యునైటెడ్ ఫ్రంట్‌కు కాంగ్రెస్ బయట నుంచి మద్దతు ఇచ్చిందని వివరించారు. దేశంలో అన్ని పార్టీలు మహా కూటమిగా ఏర్పడ్డాయని.. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత మహా కూటమే కీలక పాత్ర పోషించబోతోందన్నారు. చివరికి కేసీఆర్, జగన్ మాత్రమే మిగిలిపోతారని ఎద్దేవా చేశారు.