ఖాతా తెరవని టీజేఎస్.. కోదండరామ్ రియాక్షన్

 

తెలంగాణ ఫలితాల్లో కారు జోరుకి మిగతా పార్టీలు విలవిలలాడుతున్నాయి. టీజేఎస్ పార్టీ అయితే కనీసం ఖాతా కూడా తెరవలేదు. టీఆర్ఎస్ ని గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలు ప్రజకూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రజకూటమి కారు స్పీడ్ కి బ్రేకులు వేయలేకపోయింది. ఈ ఎన్నికల్లో కూటమి కేవలం 22 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ 20, టీడీపీ 2 సీట్లతో సరిపెట్టుకుంటే టీజేఎస్, సీపీఐ పార్టీలు కనీసం ఖాతా కూడా తెరవలేదు. టీజేఎస్ పార్టీ పొత్తులో భాగంగా మొదట్లో 30 పైగా స్థానాలు డిమాండ్ చేసింది. చివరికి 8 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక ఫలితాల విషయానికొస్తే ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయింది.

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై టీజేఎస్ అధినేత కోదండరామ్ తాజాగా స్పందించారు. నాంపల్లిలోని జనసమితి కార్యాయలంలో మాట్లాడిన ఆయన.. తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని అన్నారు. అదేవిధంగా గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఓట్లు గల్లంతుపై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారి కూడా ఓట్ల గల్లంతుపై క్షమాపణలు కోరారని.. ఓట్ల గల్లంతుపై అనేక మంది కోర్టును కూడా ఆశ్రయించారని.. అయినా న్యాయం  జరగలేదన్నారు. ప్రతి ఒక్కరి ఆత్మగౌరవం, విలువల కోసం నాలుగున్నర సంవత్సరాలు పోరాడామన్నారు. కూటమి అభ్యర్థుల గెలుపు కోసం జనసమితి కార్యకర్తలు ఎంతో శ్రమించారన్నారు. ఉద్యమ అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎంతో కృషి చేశామని అన్నారు. ఎన్నికలన్నాక తప్పుఒప్పులు జరుగుతూనే ఉంటాయన్నారు. ఓటమిని అందరూ అంగీకరించాల్సిందేనని.. ఏ ఆశయాల కోసమై ఇప్పటి వరకు పోరాటం చేశామో.. దాని కోసం రానున్న రోజుల్లో కూడా చిత్తశుద్ధితో పని చేస్తామని కోదండరామ్ తెలిపారు.