విద్రోహ దినం సందర్భంగా కోదండరాం వ్యాఖ్యలు
Published on: Fri Dec 23, 2011 11:47AM
హైదరాబాద్: కేంద్రం తెలంగాణ ప్రకటన పట్ల వెనక్కి పోయిన డిసెంబర్ 23వ తేదిని తెలంగాణవాదులు విద్రోహ దినంగా ప్రకటించారు. నిరసనగా సుందరయ్య కళా భవనం నుండి ఇందిరా పార్కుకు జెఏసి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మా వెంట ఉండేందుకు సిద్ధమైన వారి వెంటే మేం ఉంటామని ఆయన శుక్రవారం అన్నారు. పరకాల నియోజకవర్గం విషయం ఇంకా తేలలేదని, మహబూబ్ నగర్ జిల్లా నియోజకవర్గాల విషయంలో జెఏసిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తెలంగాణ కోసం రాజీనామా చేసిన వారందరికీ అండగా ఉంటామన్నారు. తమ వెంట ఎవరు వచ్చినా పార్టీలకతీతంగా వారికి మద్దతిస్తామన్నారు. తెలంగాణ సాధన కోసం స్పష్టమైన అవగాహనతో వెళుతున్నామని, ఎన్నికలు ఉద్యమంలో అంతర్భాగమే కానీ అవే లక్ష్యం కాదన్నారు. తెలంగాణ విషయంలో కేంద్రం నిరంకుశంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సకల జనుల సమ్మె తర్వాత నిర్ణయం రావాల్సి ఉన్నప్పటికీ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం కాబట్టే నిర్ణయం రాలేదన్నారు. లోక్‌సభలో ఏకాభిప్రాయం అన్న అధికార పార్టీ సభ్యుల వ్యాఖ్యలపై స్పందించారు. ఏకాభిప్రాయం రావాల్సింది కాంగ్రెసు పార్టీలోనేనని అభిప్రాయపడ్డారు.


