రేవంత్ పై చర్యలు తప్పవా.. కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది?

 

'నేను ఒక్కడిని ఒక వైపు, మిగతా పార్టీ అంతా ఒక వైపు' అన్నట్టుంది ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి పరిస్థితి. సీనియర్లంతా ఏకమై రేవంత్ రెడ్డి మీద విరుచుకుపడుతున్నారు. హుజుర్ నగర్ ఉప ఎన్నిక, యురేనియం అంశాలు దీనికి కారణమయ్యాయి. హుజుర్ నగర్ ఉప పోరు కోసం పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతిని అభ్యర్థిగా అందరూ ప్రతిపాదిస్తే, రేవంత్ మాత్రం కిరణ్ రెడ్డి అనే వ్యక్తి పేరు తెరమీదకు తీస్కోచ్చారు. అంతేకాదు యురేనియం అంశంలో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్.. జనసేన లాంటి ప్రాంతీయ పార్టీ గొడుగు కింద చేరడం ఏంటని సంపత్ కుమార్ వంటి వారు తప్పుబట్టారు. అయితే రేవంత్ మాత్రం.. యురేనియం అంశంలో వారికి ఓనమాలు తెలియవు అన్నట్టుగా వ్యాఖ్యానించారు. దీంతో ఈ రెండు అంశాల్లో రేవంత్ తీరుని పార్టీ సీనియర్లు తప్పుపడుతున్నారు.

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తాజాగా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కోదండరెడ్డి కూడా తప్పు పట్టారు. అసెంబ్లీలో మొదటి రెండు రోజులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడిన తీరుతో పార్టీ గ్రాఫ్ పెరిగిందని.. కానీ మూడో రోజు రేవంత్ మాట్లాడిన మాటలతో పార్టీ గ్రాఫ్ పడిపోయిందని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో ఎప్పుడు ఏం మాట్లాడాలనేది ఎమ్మెల్యేలే నిర్ణయించుకుంటారని చెప్పారు. యురేనియం అంశంలో ఏఐసీసీకి వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్ లు ముందే నివేదిక ఇచ్చారని తెలిపారు. సంపత్ పై రేవంత్ చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ సమావేశంలో రేవంత్ వ్యవహారంపై చర్చించామని.. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు. యురేనియం అంశంపై జనసేన నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ నేతలు వెళ్లడం ముమ్మాటికే తప్పేనని కోదండరెడ్డి అభిప్రాయపడ్డారు. పరిస్థితి చూస్తుంటే రేవంత్ పై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మరి అన్ని అంశాల్లో దూకుడుగా వ్యవహరించే రేవంత్.. ఈ అంశంలో కూడా అలాగే ముందుకి వెళ్తారో? లేక అధిష్టానం, సీనియర్లకు నచ్చజెప్పి గొడవ సద్దుమణిగేలా చేస్తారో చూడాలి.