కొడాలి నాని ఓటమి ఖాయం: వల్లభనేని వంశీ
Published on: Tue May 7, 2019 3:34PM

కొడాలి నాని.. గుడివాడ నిజయోజకవర్గం నుంచి రెండుసార్లు టీడీపీ అభ్యర్థిగా, ఒకసారి వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా మళ్ళీ బరిలో దిగారు. ఇప్పటికే గుడివాడ నుంచి వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టిన నాని.. ఇప్పుడు నాలుగోసారి కూడా గెలిచి సత్తా చాటాలనుకుంటున్నారు. అయితే ఒకప్పుడు టీడీపీ కంచుకోట అయిన గుడివాడని వైసీపీ ఖాతాలో పడేలా చేసిన నానిని.. ఈ ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలని పట్టుదలతో ఉన్న టీడీపీ.. యువనేత దేవినేని అవినాష్ ని బరిలోకి దింపింది. అవినాష్, నానికి గట్టి పోటీ ఇచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొందరు నాని తక్కువ మెజారిటీతో గెలిచే అవకాశముందని అంటుంటే.. మరికొందరు మాత్రం అవినాష్ ఖచ్చితంగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. తన స్నేహితుడు నానికి ఓటమి తప్పదని అన్నారు.
మొన్న జరిగిన ఎన్నికల్లో.. టిడిపి గాలి వీచిందని, కృష్ణా జిల్లాలో అన్ని సీట్లను టీడీపీ గెలుచుకుంటుందని వంశీ చెప్పారు. తన స్నేహితుడైన కొడాలి నాని ఈసారి గుడివాడలో ఓడిపోతున్నారని అన్నారు. గుడివాడలో టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ బాగా పనిచేశారని, ఆయన చేతిలో ఈసారి.. నాని ఓడిపోతారని స్పష్టం చేశారు. నాని తనకు ప్రాణస్నేహితుడని, ఆయనతో ఇటీవల కాలంలో మాట్లాడలేదని, కానీ.. ఆయన ఓడిపోతారని ఖచ్చితంగా చెబుతున్నానన్నారు. అదేవిధంగా మైలవరంలో దేవినేని ఉమా మళ్లీ గెలుస్తారని, ఆయనకు మళ్లీ మంత్రి పదవి దక్కుతుందన్నారు.


