ఉప్మా యాక్ట్ వ్యాఖ్యలు కొడాలి నాని అజ్ణానానికి నిలువెత్తు నిదర్శనం.!
Published on: Thu Jul 9, 2026 5:10PM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియా వేదికగా అసభ్య, అశ్లీల, అనుచిత పోస్టులు చేసిన వ్యక్తుల అరెస్టుల పర్వం సంచలనంగా మారింది. వివాదాస్పద యూట్యూబర్, బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ అరెస్టుపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెర లేపాయి. దేశ భద్రతకు సంబంధించిన ఉపా యాక్ట్ ను కొడాలి నాని ఉప్మా యాక్ట్ అని సంబోధించడంపై కూటమి వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ తెలుగువన్ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. కొడాని నాని వ్యాఖ్యలకు ఘాటు కౌంటర్ ఇచ్చారు. వైఎస్ జయంతి సందర్భంగా గుడివాడలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కొడాలి నాని.. ప్రశ్న రావణ్ అరెస్టు, ఆయనపై కేసుల విషయంలో చేసిన వ్యాఖ్యలు, మాట్లాడిన మాటలూ, కొడాలి నాని రాజకీయ అజ్ఞానాన్ని సూచిస్తున్నాయని వంశీకృష్ణ అన్నారు. దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు భంగం కలిగించే శక్తులపై ప్రయోగించే ఉపా చట్టాన్ని అపహాస్యం చేయడం దుర్మార్గమని విమర్శించారు.
దేశంలో ఉగ్రవాదులు, నక్సలైట్లపై చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (ఉపా) గురించి కనీస అవగాహన లేకుండా కొడాలి నాని మాట్లాడుతున్నారన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలు అజ్ణానంతో చేశారని తాను భావిస్తున్నాననీ, ఒకవేళ ఆయన తెలిసి బుద్ధిపూర్వకంగానే ఉపా చట్టాన్ని ఉప్మా యాక్ట్ అని అవమానించి ఉంటే, భారత రాజ్యాంగాన్ని, చట్టాలను కించపరిచినందుకు ఆయనపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
ప్రభుత్వ పెద్దలను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లను దూషించినందుకు రావణ్‌ను అరెస్ట్ చేయలేదనీ, జోసెఫ్ ఫోన్ రికార్డులను పరిశీలించిన పోలీసులు, అతను దేశ వ్యతిరేక భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ, యువతను నక్సలిజం, టెర్రరిజం వైపు ప్రేరేపిస్తున్నట్లు ఆధారాలు సేకరించారని వెల్లడించారు. ఆ సాక్ష్యాధారాల ఆధారంగానే కోర్టు అతనికి రిమాండ్ విధించిందని గుర్తుచేశారు.
వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు తొలుత ఈ జోసెఫ్‌కు పార్టీ తరపున లీగల్ సపోర్ట్ ఇస్తామని ప్రకటించి.. తీరా అతని ఫోన్ లోని వివాదాస్పద విషయాలు బయటపడగానే ప్లేట్ ఫిరాయించారని వంశీకృష్ణ ఆరోపించారు. గతంలో వర్రా రవీంద్ర రెడ్డి, బోరుగడ్డ అనిల్, శ్రీరెడ్డి వంటి వారిని పెంచి పోషించి.. ఇప్పుడు వారితో మాకేం సంబంధం లేదన్నట్లే వైసీపీ వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేనల మధ్య ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి వారు గ్యాప్ తేవాలని చూస్తున్నారని, కానీ అది అసాధ్యమన్నారు.
కొడాలి నాని రోజూ మీడియా ముందుకు వచ్చి ఇలాంటి అడ్డదిడ్డమైన వ్యాఖ్యలు చేయాలని తాను ఒక టీడీపీ కార్యకర్తగా కోరుకుంటున్నానని వంశీకృష్ణ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పోలవరం పూర్తి చేయడం, రాజధాని అమరావతి నిర్మాణం, పెట్టుబడుల సాధన వంటి అభివృద్ధి పనులపై మాట్లాడుతుంటే, వైస్సార్సీపీ నేతలు మాత్రం గొడ్డళ్లు, బూడిద వంటి భాష వాడుతున్నారని, ప్రజలే అంతిమంగా దీనిపై ఒక స్పష్టమైన నిర్ణయానికి వస్తారని చెప్పారు.
Kodali Nani Upma Act, TDP Bandaru Vamsi Krishna Comments, Prasna Ravana UAPA Case, AP Politics Latest News, Telugu News


