TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రంగంలోకి కొడాలి నాని.. వైసీపీకి మ‌ద్ద‌తుగా నందమూరి ఫ్యామిలీ!?

Published on: Sat Feb 19, 2022 10:56AM

అసెంబ్లీలో భువ‌నేశ్వ‌రిపై కొడాలి నాని, అంబ‌టి రాంబాబు, వంశీ, చంద్రశేఖర్ రెడ్డిల అసంబద్ధ కామెంట్స్‌తో వైసీపీపై, ఆ పార్టీ నేత‌ల‌పై తీవ్ర స్థాయిలో అస‌హ్యం ఏర్ప‌డింది. యావ‌త్ మ‌హిళాలోకం వారిని తిట్టిపోసింది. ఇక‌, నంద‌మూరి కుటుంబ స‌భ్యులు, అభిమానులైతే ఆవేశంతో ర‌గిలిపోతున్నారు. నోటికొచ్చిన‌ట్టు వాగిన నేత‌ల‌కు, వైసీపీ పార్టీకి గ‌ట్టి బుద్ది చెప్పేందుకు ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆ విష‌యం గుర్తించే వైసీపీ నాయ‌కులంతా మ‌ళ్లీ ఆ టాపిక్ తీసుకురావ‌డం లేదు. ఎన్ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నా.. అన్నీమూసుకొని భ‌రిస్తున్నారే కానీ కౌంట‌ర్లు వేయ‌డం లేదు. ఇక తిట్ల‌తో విరుచుకుప‌డే కొడాలి నాని సైతం కామ్ అయ్యారు.  

ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను, ముఖ్యంగా నంద‌మూరి అభిమానులు, ఓ సామాజిక వర్గం కోపాన్ని గుర్తించిన వైసీపీ పెద్ద‌లు.. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్య‌లో ఉండే వారంతా ఇలా పార్టీకి వ్య‌తిరేకంగా మారితే అది వ‌చ్చే ఎన్నిక‌ల్లో తీవ్ర న‌ష్టం చేయ‌డం ఖాయ‌మ‌ని భావిస్తున్నారు. అందుకు విరుగుడుగా.. జగన్ ప్రభుత్వానికి నందమూరి ఫ్యామిలీ దగ్గరగానే ఉందంటూ.. ప్రజల్లోకి ఓ మెసేజ్ వెళ్లగలిగితే.. అది కాస్త న‌ష్ట నివార‌ణ చేస్తుంద‌నే ఎత్తుగ‌డ వేస్తోంది. ఆ బాధ్య‌త‌ను మంత్రి కొడాలి నానికి అప్ప‌గించిన‌ట్టు తెలుస్తోంది. 

నందమూరి ఫ్యామిలీ, ఫ్యాన్స్‌ వైసీపీపై కోపంగా లేర‌నే మెసేజ్ ఇప్పించేలా ఏదో ఒక‌టి చేయాల‌ని చూస్తున్నారు కొడాలి నాని. ఆ మేర‌కు జాగ్ర‌త్త‌గా పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. ఇప్ప‌టికే జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో తెగ అంట‌కాగుతుంటారు నాని. తార‌క్ ఫ్యాన్స్ ఆయ‌న‌కు ఫుల్ స‌పోర్ట్ చేస్తుంటారు. ఇవి చాల‌వ‌న్న‌ట్టు.. పెద్ద ఎన్టీఆర్ అభిమానుల‌నూ త‌మ ఖాతాలో వేసుకోవాల‌నేది వైసీపీ స్కెచ్‌. అందులో భాగంగా, జిల్లాల విభ‌జ‌న‌ను వాడుకున్నారు. కొత్త‌గా ఏర్పాట‌య్యే కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ పేరు పెట్టి.. డ్యామేజ్ కంట్రోల్ చేయాల‌నేది జ‌గ‌న్ అండ్ కొడాలి ఎత్తుగ‌డ‌లా ఉందంటున్నారు. 

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరుకు చెందిన ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు.. నందమూరి పెద్ద వెంకటేశ్వరరావు, నందమూరి జయసూర్య, చిగురుపాటి మురళీలు  జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడుతున్నందుకు ఇటీవ‌ల‌ సీఎం జగన్‌ను కలిసి కృతజ్జతలు తెలిపారంటూ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్ అయింది. అయితే వీరికి.. ఎన్టీఆర్‌ ఫ్యామిలీకి ఎలాంటి రిలేషన్ ఉందనేది మాత్రం బయటకు రాలేదు. కానీ సీఎం జగన్‌కు ఈ నందమూరి ఫ్యామిలీని స్వయంగా పరిచయం చేసింది మాత్రం మంత్రి కొడాలి నాని, పామర్రు ఎమ్మెల్యే కె. అనిల్ కుమారులు అని తెలుస్తోంది. 

ప‌నిలో ప‌నిగా ఆ న్యూస్‌కు మ‌రింత మ‌సాలా కూడా క‌లిపారు. నిమ్మకూరు చెరువులో ఎన్టీఆర్ కాంస్య విగ్రహన్ని ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ను వారు ఇలా కోరగానే.. అలా జగ‌న‌న్న‌ అంగీకరించారని మంత్రి కొడాలి నాని తెలిపారు. అదే విధంగా ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా మేలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సీఎం జగన్ అంగీకరించినట్లు కూడా కొడాలి నాని చెప్పారు. ఇక నిమ్మకూరులో తాగునీటి సమస్య పరిష్కరించేందుకు సీఎం జగన్ కోటి రూపాయలు మంజూరు చేయడమే కాకుండా.. గ్రామంలోని అన్ని సమస్యలు పరిష్కరించాలని కూడా ఉన్నతాధికారులను ఈ సందర్భంగా ఆదేశించారని పామర్రు ఎమ్మెల్యే  కె. అనిల్ కుమార్ ప్రకటించారు. నిమ్మ‌కూరుపై స‌డెన్‌గా జ‌గ‌న్ అండ్ కో కు ఇంత ప్రేమ ఎందుకు పొంగుకొచ్చిందో వేరే చెప్ప‌న‌వ‌స‌రం లేదు. భువ‌నేశ్వ‌రి విష‌యంలో జ‌రిగిన న‌ష్టాన్ని ఇలా పూడ్చుకుంటున్నార‌ని అంటున్నారు.

ఇక‌, ఎన్టీఆర్ ఫ్యామిలీలోని సభ్యులంతా.. అంద‌రికీ తెలిసిన వారే. మ‌రి, నంద‌మూరి కుటుంబం అంటూ జ‌గ‌న్‌రెడ్డిని క‌లిసిన వారెవ‌రు? అనేదే ఆస‌క్తిక‌రం. ఈ కొత్త‌ నందమూరి ఫ్యామిలీ ఎవరంటూ సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతోంది. 

ఇక‌, ఎన్టీఆర్ జన్మించింది.. మచిలీపట్నంకు స‌మీపంలోని నిమ్మకూరు గ్రామం అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే, కొత్త‌గా ఏర్పాటు కానున్న‌ మ‌చిలీప‌ట్నం జిల్లాకు కాకుండా.. విజయవాడ కేంద్రంగా ఉండే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్ట‌డం రాజ‌కీయం కాక మ‌రొక‌టి కాదంటున్నారు. నిజంగా ఎన్టీఆర్ మీద అభిమానంతోనే పేరు పెడితే.. మచిలీపట్నం కేంద్రంగా ఉన్న పాత కృష్ణా జిల్లాకే పెట్టాలని డిమాండ్ సైతం వినిపిస్తోంది. 

విజయవాడ కేంద్రంగా ఏర్పాటవుతోన్న కొత్త జిల్లాలో అత్యధిక శాతం ఓట్లు ఓ సామాజిక వర్గానికి  చెందినవే... ఆ ఓట్లను గంప గుత్తగా కొల్లగొట్టడానికే.. జగన్ రెడ్డి ప్ర‌భుత్వం ఎన్టీఆర్ పేరుతో ఎర వేస్తోంద‌నే అనుమానం. ఇలా, మంత్రి కొడాలి నాని డైరెక్షన్‌లో నందమూరి ఫ్యామిలీ.. ఎన్టీఆర్ జిల్లా అంటూ.. కొత్త రాజ‌కీయ జ‌గ‌న్నాట‌కం న‌డిపిస్తున్నార‌ని అంటున్నారు. 

also watch: కొడాలి నాని కొత్త నాటకం!