తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాలనడం నీచ రాజకీయం.. కొడాలి నాని సెన్సేషనల్ కామెంట్స్

తిరుమలను సందర్శించే అన్యమతస్థుల నుండి డిక్లరేషన్ తీసుకునే విధానాన్ని ఎత్తి వేయాలని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. వెంకటేశ్వరస్వామి పరమ భక్తుడిగా ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని ఆయన వ్యాఖ్యానించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు ఏపీ సీఎం జగన్ ఆరు కోట్ల ఆంధ్రుల ప్రతినిధిగా తిరుమలకు వెళుతున్నారని మంత్రి కొడాలి నాని అన్నారు. ఏపీలో అన్ని మతాలు, కులాల వారు ఉన్నారని.. సీఎం జగన్ కేవలం హిందువుల ప్రతినిధిగా మాత్రమే తిరుమలకు వెళ్లడం లేదని అయన అన్నారు. అసలు సీఎం జగన్ ‌ను డిక్లరేషన్‌పై సంతకం చేయాలంటున్న వారిది నీచ రాజకీయమని కొడాలి నాని మండిపడ్డారు. అంతేకాకుండా సోము వీర్రాజుకు, చంద్రబాబుకు తాను ఎందుకు క్షమాపణ చెప్పాలని కొడాలి నాని ఈ సందర్భంగా ప్రశ్నించారు. తానేమీ తప్పుగా మాట్లాడలేదని.. తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.