కొడాలి నానికి కరోనా.. ఆసుపత్రిలో చేరిక.. వైసీపీ వర్గాల్లో కంగారు!
Published on: Wed Jan 12, 2022 10:09AM
మంత్రి కొడాలి నాని కరోనా బారిన పడ్డారు. జ్వరం, దగ్గులాంటి లక్షణాలు ఉండటంతో కొవిడ్ టెస్ట్ చేయించుకున్నారు. పాజిటివ్ రావడంతో హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం కొడాలి నానికి చికిత్స కొనసాగుతోంది. హాస్పిటల్ లో చేరాల్సినంత అవసరం వచ్చిందంటే.. నాని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందోనని వైసీపీ శ్రేణులు ఆరా తీస్తున్నాయి. ఎంతైనా కొడాలి నాని టీడీపీ వారికి కూడా ఫేవరేట్ కదా.. అందుకే తెలుగుదేశం వర్గాలూ నాని హెల్త్ కండిషన్ తెలుసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నాయి.
మరోవైపు, టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ సైతం కరోనా బారినపడ్డారు. నానా, రాధా ఇద్దరూ హైదరాబాద్ లోని ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు. వంగవీటికి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని తెలుస్తోంది.
వంగవీటి రాధా ఈ నెల 9న కృష్ణా జిల్లా కంచికచర్లలో దివంగత తన తండ్రి రంగా విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. ఆ సందర్భంలోనే రాధాకు కరోనా వైరస్ సంక్రమించి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇదే కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఇతర ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. వారిలో వంగవీటి రాధా, మంత్రి కొడాలి నాని కరోనా బారిన పడటంతో.. వల్లభనేని వంశీ సైతం ఐసోలేషన్ లో ఉంటే మంచిదని సూచిస్తున్నారు.


