19నుండి తెలంగాణ పోరు యాత్ర:కిసాన్ రెడ్డి
Published on: Sun Jan 15, 2012 10:48AM
హైదరాబాద్:ఈనెల 19వ తేదీ నుంచి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న తెలంగాణ పోరు యాత్రను తెలంగాణ ప్రాంతంలోని అన్ని రాజకీయ పార్టీలు విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. దీనిపై ఆయన మాట్లాడుతూ ఈ యాత్ర రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు శ్రీకారం చుట్టనుందని జోస్యం చెప్పారు.ఈ యాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేస్తున్న మోసాన్ని ప్రజలకు వివరిస్తానన్నారు.వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే తెలంగాణ పోరు యాత్ర నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ నెల 19న మహబూబ్‌నగర్ జిల్లా కృష్ణానది తీరంలోని కృష్ణ గ్రామంలో కృష్ణమ్మ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి యాత్రను ప్రారంభించనున్నట్లు చెప్పారు.తెలంగాణలోని అన్ని జిల్లాల్లో జరిగే ఈ యాత్ర ఫిబ్రవరి 9న ఖమ్మం జిల్లాలోని భద్రాచలం పుణ్యక్షేత్రం వద్ద ముగుస్తుందని ఆయన వివరించారు.అనంతరం ఫిబ్రవరి 11వ తేదీన నిజాంకాలేజీ మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని ఆయన తెలిపారు.


