స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష

ప్రభుత్వ వైద్యం పై భరోసా కల్పించాలి

తెలంగాణ రాష్ట్రంలో వేలసంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న సందర్భంలో కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి. కిషన్ రెడ్డి హైదరాబాద్ లోని కోవిద్ ఆసుపత్రులను సందర్శించారు. గచ్చిబౌలిలోని టిమ్స్, సనత్ నగర్ లోని ఆయుర్వేద ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రులను సందర్శించి కరోనా పాజిటివ్ రోగులకు అందుతున్న వైద్య సదుపాయాల గురించి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి మరింత మెరుగైన సేవలు అందించాలని కోరారు.  ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో భరోసా కల్పించాలని ఆయన సూచించారు.

కరోనా మరింతగా విజృంభించే ప్రమాదం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కిషన్ రెడ్డి సూచించారు. కరోనా వ్యాధి వస్తే మందు లేదని, వైద్యులు కేవలం ఆక్సిజన్ మాత్రమే ఇస్తారన్నారు.  ప్రజలందరూ స్వీయ నియంత్రణలో ఉంటే కరోనా దరి చేరదన్నారు. స్వీయనియంత్రణే శ్రీరామ రక్ష అన్న విషయం ప్రజలంతా గుర్తించుకోవాలన్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వం కరోనా చికిత్స అందించే ఆసుపత్రుల్లో మరిన్ని సౌకర్యాలు పెంచాలని, కరోనా వారియర్స్ కి ఇంటెన్సివ్స్ పెంచాలని కోరారు. సిబ్బంది కోరత ఇబ్బంది లేకుండా  ఔట్ సోర్సింగ్ సిబ్బందిని మరింత పెంచాలన్నారు.

ఢిల్లీ-ముంబై తో పోల్చితే తెలంగాణ లో పరీక్షలు చాలా తక్కువ సంఖ్యలో చేస్తున్నారని, పాజిటివ్ కేసుల పై ప్రభుత్వం దగ్గర సరైన లెక్కలు లేవన్నారు. కరోనా పాజిటివ్ వ్యక్తులు బయట తిరగకుండ కట్టడి చేస్తేనే వ్యాప్తి తగ్గుతుందన్నారు. పాజిటివ్ కేసుల సంఖ్యను, మరణించిన వారి సంఖ్యను దాచడం వల్ల ప్రయోజనం లేదని ఇది మరింత ప్రమాదానికి దారి తీస్తుందని కిషన్ రెడ్డి హెచ్చరించారు. లోపాలను సరిద్దుకోని రాష్ట్రం కలిసి వస్తే, కేంద్రం నుంచి రావాల్సిన అన్ని సదుపాయాలను అందిస్తామన్నారు. కరోనా సాయం అందించడంతో తన వంతు సహాయం చేస్తానన్నారు.

గచ్చిబౌలిలోని టిమ్స్  ఆస్పత్రిని సందర్శించిన మంత్రి అక్కడ  అందుతున్న వైద్య సదుపాయాల గురించి తెలుసుకున్నారు.  చికిత్స పొందుతున్న రోగుల వార్డులను పరిశీలించారు. రోగులకు ఇంకా మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని డాక్టర్లకు సూచించారు. సనత్ నగర్ లోని ఆయుర్వేద ఆసుపత్రి వైద్య సిబ్బందితో ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్య సాయం పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్నా కోవిద్ 19 వైరస్ టెస్టింగ్ సెంటర్ ను మంత్రి పరిశీలించి, అనుమానిత రోగులతో టెస్టింగ్ సదుపాయలపై అరా తీశారు.

గాంధీ ఆస్పత్రిలో రోగుల వార్డులను పరిశీలిస్తూ వారికి అందుతున్న సదుపాయాలను, ఆక్సిజన్ లభ్యతను అడిగి తెలుసుకున్నారు. కరోనా సమయంలో రెండోసారి కిషన్ రెడ్డి గాంధీ ఆసుపత్రిని సందర్శించారు.