మెట్రో అధికారుల తీరుపై కిషన్ రెడ్డి అసహనం.. ఈరోజు మెట్రోలో ప్రయాణం!!

హైదరాబాద్ మెట్రో ప్రారంభోత్సవ కార్యక్రమానికి పిలవలేదని బిజెపి ప్రజాప్రతినిధులు సీరియస్ అవుతున్నారు. ప్రోటోకాల్ ప్రకారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఆహ్వానించకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది బిజెపి. ఈ నేపథ్యంలో కేంద్రం భాగస్వామ్యం కూడా ఉందని చెప్పేందుకు ఇవాళ మెట్రోలో ప్రయాణం చేయనున్నారు బిజెపి నేతలు. ఈ నెల ఏడున జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో రైలు సేవలు మొదలయ్యాయి. సీఎం కేసీఆర్ ఈ రూటును ప్రారంభించారు, ఈ కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానించాల్సిన అందరి నేతలను పిలిచారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రరావులకు మాత్రం ఆహ్వానం అందలేదట. దీనిపై రామచంద్రరావు అదే రోజున అసంతృప్తి వ్యక్తం చేశారు. దీన్ని సీరియస్ గా తీసుకుంటానని సంబంధిత వేదికలపై ఫిర్యాదు చేస్తానన్నారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి చివరి నిముషంలో సమాచారమిచ్చారని తెలుస్తుంది. ఒకవైపు పార్లమెంట్ సెషన్స్ నడుస్తుంటే ముందస్తు సమాచారం లేకుండా ఇలా ప్రోగ్రాం ఫిక్స్ చేస్తారని ఆయన అనుచరులు అంటున్నారు. తమ పార్టీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులకు ఆహ్వానం అందకపోవడంపై బీజేపీ మండిపడుతోంది. తమ భాగస్వామి కూడా ఉందని చెప్పేందుకు బిజెపి నేతలు ఇవాళ మెట్రోలో ప్రయాణించనున్నారు. ఈ కార్యక్రమానికి మెట్రో అధికారులను కూడా పిలిచారు. మధ్యాహ్నం మెట్రో అధికారులతో రివ్యూ చేయనున్న కిషన్ రెడ్డి ఆ తరువాత జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఎమ్మెల్సీ రామచంద్రరావు, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ ఇతర నేతలతో కలిసి ప్రయాణించనున్నారు.