పేద‌ల‌కు కరోనా ప్యాకేజ్! జన్ ధాన్ ఖాతాల్లోకి నేరుగా జమ!

కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అలాగే జన్ ధాన్ ఖాతాల్లోకి డబ్బులు నేరుగా జమ చేస్తామని వెల్లడించారు. కిసాన్ సమ్మాన్ నిధి హామిలో భాగంగా.. మొదటి వాయిదాగా రూ.2వేలను రైతుల ఖాతాల్లో వేయనున్నట్టు తెలిపారు. ఈ పథకం కింద మొత్తం 8.69కోట్ల రైతులు లబ్ది పొందుతారు.

అలాగే సంఘటిత కార్మికులు.. కూలీ, నాలి చేసుకొనే వారు, కార్మికులు, నిరుద్యోగులు.. రైతులకు.. వితంతువులకు, పెన్షనర్లు, దివ్యాంగులు.. జన్ ధన్ యోజన ఖాతాధారులకు ప్రతి ఒక్కరికి నగదు ఇచ్చేందుకు కేంద్రం ప్రణాళికలు వేసింది.

లక్షా 70వేల కోట్ల ప్యాకేజీ రెడీ చేయగా.. ఎకనామిక్ రిలీఫ్ ప్యాకేజీలో భాగంగా.. దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించవద్దని.. అలాగే ఎవరి చేతిలోనూ డబ్బు లేని పరిస్థితి ఉండవద్దని ప్రభుత్వం భావిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అందులో భాగంగానే ఈ ప్యాకేజీతో పేదల ఆకలి తీర్చడంతో పాటు వారి ఖాతాల్లో ప్రత్యక్షంగా కొంత డబ్బును జమ చేస్తామని చెప్పారు.

ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద 2,000 రూపాయ‌లు ఏప్రిల్ మొదటి వారంలో ఇచ్చేందుకు నిర్ణయించింది. దీంతో 8.69 కోట్ల మంది రైతులకు వెంటనే ప్రయోజనం లభిస్తుంది.

ఎంఎన్‌ఆర్‌ఇజీఎ Mahatma Gandhi National Rural Employment Guarantee Act వేతన రేటును రూ .182 నుంచి రూ .202 కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని వల్ల ఒక్కో కార్మికునికి రూ .2000 పెరగనుంది. దీని వల్ల 5 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుంది.

వృద్దులు,దివ్యాంగులకు ప్రతీ నెలా ఎక్స్‌గ్రేషియా కింద రూ.1000 చెల్లించనున్నారు. దీనివల్ల 3 కోట్ల మంది వితంతువులు, సీనియర్ సిటిజన్లు ప్రయోజనం పొందుతారు.

జన్‌ధన్ ఖాతాలను కలిగిన మహిళలకు ప్రతీ నెలా వారి ఖాతాలో రూ.500 చొప్పున వచ్చే మూడు నెలల పాటు జమ చేయనున్నారు. దీనివల్ల 20 కోట్ల మంది మహిళలకు ప్రయోజనం ఉంటుంది.

మూడు నెలలు పాటు ఉచిత సిలిండర్లు. దీని వల్ల 8.3 కోట్ల బిపిఎల్ కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది.