మీ నాన్న ఆత్మ క్షోభిస్తూ ఉంటుంది-కిరణ్ రిజుజు

ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థిని గురుమెహార్ కౌర్ వ్యవహారంలో సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లు రాజకీయంగా వాతావరణాన్ని వేడిక్కిస్తున్నాయి. దీనిపై దేశప్రజలతో పాటు ప్రముఖులు కొందరు ఆమెను సమర్థిస్తుండగా..మరికొందరు విమర్శిస్తున్నారు. తన తండ్రిని చంపింది యుద్ధమేనని పాకిస్థాన్ కాదని రాసి ఉన్న పోస్టర్ పట్టుకుని ఆమె సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేపట్టారు. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజుజు స్పందించారు. ఒకపక్క కౌర్ చర్యలను వ్యతిరేకిస్తూనే మరోవైపు ఆమెను దూషించిన వారిపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.

 

కౌర్ తండ్రి దేశం కోసం ప్రాణాలర్పించిన వీర సైనికుడని కొనియాడారు. ఎవరో ఆమె ఆలోచనలను కలుషితం చేస్తున్నారని..తమ అభిప్రాయం వెలిబుచ్చడానికీ ప్రతీ భారతీయుడికి స్వేచ్ఛ ఉందని..కాని దేశవాసులు, సైన్యం యొక్క స్థైర్యాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేయడం మాత్రం ఎవరికీ తగదన్నారు. ఆమె చర్యల్ని చూసి కౌర్ తండ్రి ఆత్మ తప్పనిసరిగా క్షోభిస్తుందని మంత్రి వ్యాఖ్యానించారు. మరో వైపు కౌర్‌ను బెదిరిస్తూ కొంతమంది అసభ్యపదజాలంతో కూడిన సందేశాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండటంతో వారిపై కఠినచర్యలు తీసుకోవాలని పోలీసుల్ని ఆదేశించినట్టు కిరణ్ వెల్లడించారు.