కిరణ్ కుమార్ రెడ్డి, ఉండవల్లి కాంగ్రెస్ లోకి వస్తారా?

 

ఒకప్పుడు ఏపీలో కాంగ్రెస్, ఐతే అధికారంలో ఉండేది లేదా బలమైన ప్రతిపక్షంగా ఉండేది.. కానీ రాష్ట్ర విభజన తరువాత 'ఒకప్పుడు ఏపీలో కాంగ్రెస్ ఉండేది' అని చెప్పుకునే పరిస్థితికి వచ్చింది.. రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లు గడిచింది.. కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే ఏపీలో తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుంది.. 2019 ఎన్నికల సమయానికి పార్టీని బలోపేతం చేయాలని చూస్తుంది.. విభజనకి ముందు కాంగ్రెస్ లో చాలామంది బలమైన నాయకులు ఉండేవారు.. విభజన తరువాత ఏపీలో కాంగ్రెస్ మీద తీవ్ర వ్యతిరేకత రావడంతో..  చాలామంది కాంగ్రెస్ ని వీడి టీడీపీ,వైసీపీ,బీజేపీ పార్టీలలో చేరారు.. ఇక కొందరు నాయకులైతే అసలు రాజకీయాలకే దూరమయ్యారు.. 

అతి కొద్దిమంది నాయకులు మాత్రమే వేరే పార్టీలలో ఇమడలేమనో లేదా ఎప్పటికైనా కాంగ్రెస్ పుంజుకుంటుందన్న ఆశతోనో పార్టీనే అంటిపెట్టుకొని ఉన్నారు.. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మీద కాస్త వ్యతిరేకత మొదలవడంతో, కాంగ్రెస్ లో ఉత్సాహం మొదలైంది.. 2019 లో అధికారమే లక్ష్యంగా అడుగులేస్తూ.. రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది.. అలానే ప్రాంతీయ పార్టీలతో దోస్తీకి సిద్ధమైంది.. ఐతే ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఏపీ మీద కూడా సీరియస్ గా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది.. పార్టీని వీడిన సీనియర్ నాయకులని తిరిగి పార్టీలోకి ఆహ్వానించి, ఏపీలో మళ్ళీ కాంగ్రెస్ కి పూర్వ వైభవం తీసుకురావాలని చూస్తున్నారట.. ఇప్పటికే ఆ దిశగా పావులు కూడా కదుపుతున్నట్టు తెలుస్తుంది.. 

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్, కావూరి సాంబశివరావు లాంటి సీనియర్ నాయకులను తిరిగి కాంగ్రెస్ లోకి తీసుకురావాలని చూస్తున్నారట.. అలానే కాంగ్రెస్ నుండి మిగతా పార్టీలకు వెళ్లిన నేతలని కూడా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారట.. అలానే 'తప్పనిసరి  పరిస్థితుల్లో విభజన జరిగింది.. ఏపీకి ప్రత్యేకహోదా కాంగ్రెస్ తోనే సాధ్యం' అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని చూస్తున్నారట.. 'ఇప్పుడున్న పరిస్థితుల్లో నాయకులు ధైర్యం చేసి తిరిగి కాంగ్రెస్ కి రావడం.. ప్రత్యేకహోదా కోసం కాంగ్రెస్ ని నమ్మి ప్రజలు ఓటెయ్యడం కష్టమే' అంటున్నారు విశ్లేషకులు.. చూద్దాం ఏం జరుగుతుందో.