కిరణ్ ఎంట్రీ.. కేవీపీ ఎగ్జిట్..!!

 

రాష్ట్ర విభజన చేసి కాంగ్రెస్ ఏపీకి అన్యాయం చేసిందని ఏపీ ప్రజలు అనుకుంటారు కానీ, విభజన వల్ల ఏపీలో కాంగ్రెస్ కూడా అంతే అన్యాయం అయిపోయింది అనేది వాస్తవం.. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, విభజన అనంతరం ఏపీలో అంధకారంలోకి వెళ్ళింది.. ఆ పార్టీ నాయకులంతా టీడీపీ, వైసీపీ పార్టీల తీర్థం పుచ్చుకున్నారు.. కాంగ్రెస్ పార్టీ కేడర్ చాలావరకు వైసీపీకి వెళ్ళిపోయింది.. దీంతో ఇక ఏపీలో కాంగ్రెస్ కోలుకోవడం కష్టమే అనుకున్నారు అంతా.. 

ఢిల్లీ పెద్దలు కూడా అదే అనుకున్నట్టున్నారు.. అందుకే 2014 ఎన్నికల ఘోర పరాజయం తరువాత, ఇక కాంగ్రెస్ ఏపీ మీద దృష్టి పెట్టలేదు.. ఉన్న ఒకరిద్దరు నాయకులు కూడా వేరే పార్టీలో చేరలేక, కాంగ్రెస్ ని బలపరచలేక కిందామీదా పడుతున్నారు.. నాలుగేళ్లుగా ఏపీ మీద పెద్దగా దృష్టి పెట్టని అధిష్టానం, ఇప్పుడిప్పుడే దృష్టి పెడుతుంది.. మోడీ మీద ఇప్పుడిప్పుడే వ్యతిరేకత మొదలవ్వడం.. బీజేపీ సౌత్ లో అంతగా బలపడకపోవడంతో.. కాంగ్రెస్, మోడీ వ్యతిరేక శక్తుల్ని ఏకం చేయాలని చూస్తుంది.. అలానే ఒకప్పుడు పట్టున్న సౌత్ రాష్ట్రాల్లో తిరిగి పుంజుకోవాలని చూస్తుంది.. 

దానిలో భాగంగానే కాంగ్రెస్, ఏపీ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది.. పార్టీ ని వీడి, వేరే పార్టీలో చేరకుండా ఉన్న కొందరు సీనియర్ నాయకుల్ని తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలని చూస్తుంది.. ఇప్పటికే ఉమ్మడి రాష్ట్ర చివరి సీఎం కిరణ్ కుమార్ ని కాంగ్రెస్ సంప్రదించింది.. విభజన సమయంలో 'లాస్ట్ బాల్.. లాస్ట్ బాల్' అంటూ చివరికి చేతులెత్తేసి సీఎం పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ ను వీడిన కిరణ్.. కాంగ్రెస్ లోకి రీఎంట్రీ ఇవ్వడానికి కొన్ని షరతులు, అలానే పార్టీకి కొన్ని సూచనలు ఇచ్చినట్టు తెలుస్తుంది.. కిరణ్ కాంగ్రెస్ లోకి రీఎంట్రీ ఇస్తూ ఫస్ట్ బాల్ కే కేవీపీ ని ఔట్ చేయాలని చూస్తున్నారట.. 

కేవీపీ పేరుకి కాంగ్రెస్ లో ఉన్నా, వైసీపీ కి మద్దతుగా పనిచేస్తారనే ఆరోపణలు ఉన్నాయి.. దీనివల్లే కాంగ్రెస్ ఏ మాత్రం పుంజుకోలేకపోయిందని భావించిన కిరణ్, ముందు కేవీపీ లాంటి వారికి చెక్ పెట్టాలని సూచించినట్టు తెలుస్తుంది.. అలానే వైసీపీ మీద సానుభూతి ఉండకూడదు, ఆ పార్టీ ప్రత్యర్థి బీజేపీతో దోస్తీకి సిద్ధమైంది.. ఇప్పుడు వైసీపీలో ఉన్న వారంతా ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉన్నవారే, అందుకే వైసీపీ ని టార్గెట్ చేసి వారిని తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చేలా చేయాలని కిరణ్ సూచించినట్టు తెలుస్తుంది.. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం కూడా అదే దిశగా పావులు కడుపుతుందట.. చూద్దాం మరి కాంగ్రెస్ ఏ మేరకు తన ఓటు బ్యాంకును తిరిగి సాధించుకుంటుందో.