`లాస్ట్‌ బాల్‌` టైముందోచ్‌..



    రాష్ట్రముఖ్యమంత్రి కిరణ్‌ మహాక్రీడా ప్రియుడని మరోసారి నిరూపించుకున్నారు. సమైక్యం కోసం వీలున్నప్పుడల్లా డైలాగుల బౌండరీలు, స్పీచ్‌ల సిక్సర్లు కొడుతున్నకిరణ్‌గారు.. ఇటీవల కొంత సైలెంట్‌గా ఉన్న విషయం విదితమే. ఫుడ్‌పాయిజన్‌ అంటూ అసెంబ్లీకి డుమ్మా కొట్టేసిన ఆయన విపక్షాల విమర్శల్ని తిప్పి కొట్టేందుకు తీరుబాటుగా అసెంబ్లీ వాయిదా వేసి మరీ సిద్దమయ్యారు. అసెంబ్లీ వాయిదా అనంతరం మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో తెలంగాణ బిల్లు ఇంకా ప్రవేశ పెట్టలేదని తేల్చి చెప్పారు. అయితే విభజన అంశంపై శాసనసభ అభిప్రాయం చెప్పాల్సిందేనన్నారు. బిల్లుపై చర్చ జరిగితే తమ ఎమ్మెల్యేల వైఖరులేంటో ప్రజలే తెలుసుకుంటారన్నారు. గతంలో ఇతర రాష్ట్రాల విభజన జరిగిన తీరు తెన్నులను తాను అధ్యయనం చేశానని ఆ అధ్యయన ఫలితాలు అసెంబ్లీ స్పీకర్‌, శాసన మండలి చైర్మన్‌లకు అందించానన్నారు. తొలుత బీహార్‌, యుపి అసెంబ్లీలు విభజన తీర్మానాన్ని తిరస్కరించాయని, రెండేళ్ల తరువాత మాత్రమే అంగీకారం తెలిపాయని ఆయన వెల్లడించారు. తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని, సీమాంద్రకు అనుకూలం కాదని అయతే ప్రజా ప్రయోజనాలకే మాట్లాడుతున్నానని ఆయన వివరించారు. తాను వాస్తవాలు మాట్లాడుతుంటే విపక్షనేతలు రాజకీయాలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తన నిజాయితీరి ఎవరి సర్ఠిఫికేట్‌ అవసరం లేదన్నారు. తానేమీ పోరాటం విరమించలేదని, లాస్ట్‌ బాల్‌కి ఇంకా టైముందని అంటూ.. తానేంటో నిరూపిస్తానని కూడా అన్నారు సో.. చివరి బంతి ఎప్పుడు పడుతుందో, దాన్ని కిరణ్‌ గారు బౌండరీ దాటిస్తారో తనతో పాటు అందర్నీ క్లీన్‌బౌల్డ్‌ చేస్తారో.. వెయిట్‌ అండ్‌ సీ.