కాంగ్రెస్ మార్క్ పాలన...కాంగ్రెస్ మార్క్ కష్టాలు

 

కాంగ్రెస్ మార్క్ పాలనలో కేవలం ప్రజలే కాక స్వయంగా ఆ పార్టీకి కూడా చాలా కష్టాలు, కన్నీళ్లు తప్పడంలేదు. రాష్ట్రవిభజనతో కొత్త సమస్యను సృష్టించుకొని అందులోంచి బయటపడలేక తిప్పలు పడుతున్నకాంగ్రెస్ అధిష్టానానికి, నిన్నముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విసిరిన సవాలుతో ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకొంది.

 

ఆయన ఇంత బహిరంగంగా అధిష్టానానికి సవాలు విసురుతున్నపటికీ, వెంటనే ఆయనని పదవిలోంచి తొలగించలేని దుస్థితి కాంగ్రెస్ పార్టీది. ఒకవేళ తొలగిస్తే అది ప్రజలలో ఆయన ఇమాజ్ మరింత పెంచుతుంది. తెలుగు ప్రజలను రెండుగా చీల్చి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఇప్పటికే చాలా ఆగ్రహంతో ఉన్నసీమాంధ్ర ప్రజలను అది మరింత రెచ్చగొట్టే ప్రమాదం ఉంది. అలాగని ఉపేక్షిస్తే ప్రజలలో అధిష్టానం చులకన అవుతుంది. బహుశః జగన్మోహన్ రెడ్డి ద్వారా కిరణ్ ప్రభుత్వాన్నికూలద్రోయించి, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విదించి ఈ గండం గట్టెక్కే ప్రయత్నం చేయవచ్చును.

 

ఇక్కడ రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉండగా, అక్కడ డిల్లీలో నిన్న జరిగిన మీడియా సమావేశంలో ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్వంత పార్టీపై, ప్రభుత్వంపై చేసిన తీవ్ర విమర్శలతో కాంగ్రెస్ అధిష్టానం చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకొంది.

 

నేరారోపణలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులను రక్షించేందుకు తమ పార్టీ, ప్రభుత్వం కలిసి బిల్లు తీసుకురావడాన్ని రాహుల్ గాంధీ తీవ్రంగా ఆక్షేపిస్తూ “ఆ బిల్లును చింపి చెత్త కుప్పమీద పడేయాలి. బీహార్ రాష్ట్రంలో మా పార్టీ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకొనేందుకే ఇటువంటి బిల్లుకి మా పార్టీ ఆమోదం తెలిపిందని భావిస్తున్నాను. ఈవిధంగా ప్రతీ విషయంలో రాజీపడుతూ పోతే, ఇక ఎప్పటికీ దేశం నుండి అవినీతిని పారద్రోలలేమనే సంగతిని మా పార్టీతో సహా అన్నిరాజకీయ పార్టీలు గమనించాలి,”అని అన్నారు.

 

ఆయన రాక మునుపు మీడియా సమావేశంలో మాట్లాడుతున్నపార్టీ కార్యదర్శి అజయ్ మాకన్, కాంగ్రెస్ పార్టీ నేతలతో సహా ప్రతిపక్షాలు ఈ బిల్లుపై చేస్తున్నఆరోపణలను, విమర్శలను ఆయన తీవ్రంగా ఖండిస్తూ, “వారిది అవగాహనా రాహిత్యమని బిల్లును సమర్దించుకొని వస్తున్నారు. కానీ రాహుల్ గాంధీ కూడా బిల్లుకు వ్యతిరేఖంగా మాట్లాడేసరికి, అజయ్ మాకన్ నోట మాట రాలేదు కాసేపు. చివరికి మా పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పినదే మా పార్టీ సిద్ధాంతం,’ అని ప్రకటించి బయటపడ్డారు. రాహుల్ గాంధీ విమర్శలతో కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడగా, బిల్లును వ్యతిరేకిస్తున్నబీజేపీ తదితర ప్రతిపక్ష పార్టీలన్నీకాంగ్రెస్ పార్టీని ఇదే అదునుగా దుయ్యపట్టసాగాయి.

 

ఇక నిన్నముగ్గురు పాకిస్తాన్ ఉగ్రవాదులు జమ్మూకాశ్మీర్ లోకి చొరబడి ఒక ఆర్మీ కల్నల్ తో సహా 12మందిని చంపినప్పటికీ, ప్రధాని డా. మన్మోహన్ సింగ్ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో ఈ రోజు సమావేశం అవుతానని ప్రకటించడంపై కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది.

 

ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానాన్ని విమర్శిస్తుంటే, అక్కడ డిల్లీలో స్వయంగా ఆ పార్టీ ఉపాధ్యక్షుడే తమ పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శించడం విశేషం. ఇద్దరూ పార్టీలో, ప్రభుత్వంలో కూడా చాలా కీలకమయిన వ్యక్తులే కావడంతో వారి విమర్శలకు కాంగ్రెస్ అధిష్టానాన్ని ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకొన్న ప్రతీసారి ప్రజల, మీడియా దృష్టిని మళ్ళించేందుకు కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక ఉపాయం పన్నుతుంటుంది. బహుశః ఈసారి చేతిలో సిద్ధంగా ఉన్న తెలంగాణా సమస్యను హైలైట్ చేస్తూ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విదిస్తుందేమో.