ఆపరేషన్ కిరణ్ సర్కార్

 

 క్రమంగా రాష్ట్ర విభజన అనివార్యమని తేలుతున్నతరుణంలో దానిని వ్యతిరేఖిస్తున్నముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరియు సీమాంధ్ర మంత్రులు ఇప్పుడు ఏమి చేయబోతారనే ప్రశ్న తలెత్తుతోంది. సీమాంధ్ర ప్రజలు, ఏపీ ఎన్జీవోలు సమైక్యాంధ్ర కోరుతూ నానాటికి ఉద్యమం తీవ్రతరం చేస్తుండగా, వారికి తాము ఏవిధంగా జవాబు చెప్పుకోవాలని ఆవేదన చెందుతున్నారు. ఇక సీమాంద్రాకు చెందిన కేంద్ర మంత్రులయితే రాష్ట్రానికి తిరిగి రావడానికి కూడా భయపడుతూ డిల్లీలోనే కాలక్షేపం చేస్తున్నారు. ఇటీవల డిల్లీ వెళ్ళిన శైలజానాథ్ తదితరులకు త్వరలో హోంశాఖ తెలంగాణా నోట్ కేంద్ర మంత్రి మండలి ఆమోదానికి పంపుతున్న సంగతి తెలుసుకొని కంగు తిన్నారు. ఆ తరువాత తెలంగాణా ఏర్పాటుకోసం రాష్ట్ర శాసనసభలో బిల్లు ప్రవేశ పెట్టినప్పుడు దానిపై సభలో చర్చజరుగుతుంది తప్ప ఓటింగ్ లేకుండా చేసేందుకు, కేంద్రం ముందుగానే స్పీకర్ నాదెండ్ల మనోహర్ కి అందుకు తగిన సూచనలు ఇచ్చింది.

 

అందువల్ల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బిల్లుపై చర్చ జరిగిన తరువాత, సభలోనే రాజీనామా చేసి, సమైక్యవాదిగా బయటకు రావాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా ఆయన పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేఖించినప్పటికీ అడ్డుకోబోవడం లేదు గనుక పార్టీ ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉపేక్షించవచ్చును. ముఖ్యమంత్రితో బాటే మిగిలిన సీమాంధ్ర మంత్రులు, శాసనసభ్యులు అందరూ కూడా రాజీనామాలు చేసే అవకాశం ఉంది గనుక, అంతకంటే ముందే కేంద్రం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి శాసనసభను నిద్రాణ స్థితిలో ఉంచి, విభజన ప్రక్రియ వేగవంతం చేసే అవకాశం ఉంది.

 

ఇక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన వెనుకనే మిగిలిన సీమాంధ్ర మంత్రులు ప్రజలలోకి వచ్చి తాము ఆఖరి నిమిషం వరకు పోరాడి ఓడిపోయామని, ఇక ‘సమన్యాయం’ కోసం పోరాటం మొదలుపెడతామని ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేయవచ్చును. అప్పటికి ఏపీ యన్జీవోలు కూడా తమ పట్టు సడలించే అవకాశం ఉందని, వారితో బాటే ప్రజలు కూడా వెనక్కి తగ్గే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. ప్రజలు, ఉద్యోగులు వెనక్కి తగ్గితే ఇక తెదేపా, వైకాపాలు వారిని అనుసరించక తప్పదు. అంటే ఈ పరిణామాలన్నీ రాగల 10రోజుల్లో జరిగే అవకాశం ఉందనుకోవచ్చును.

 

ఆ తరువాత అంటోనీ కమిటీతో బేరసారాల డ్రామాలతో మరో నెల, రెండు నెలలు సాగదీస్తూ రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలంగా కనబడగానే ఎన్నికలకి గంట కొట్టేస్తే అప్పుడు అందరి దృష్టి రాష్ట్ర విభజనపై నుండి ఎన్నికల పైకి మళ్ళుతుంది. ఈ లోగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో అతని అనుచర మంత్రులు కూడా మెల్లగా సర్దుకోవడానికి వెసులుబాటు దొరుకుతుంది.

 

కాకపోతే తమ ఉద్యమాలను ఏ మాత్రం ఖాతరు చేయకుండా రాష్ట్ర విభజన చేసినందుకు ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఓడిస్తారా లేక కిరణ్ కుమార్ రెడ్డి మొహం చూసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారా అనేది తేలేందుకు చాల సమయం ఉంది.