కిరణ్ సర్కార్ ఫై కోదండరామ్ జోస్యం
Published on: Wed Feb 1, 2012 9:46AM
హైదరా
బాద్: రాష్ట్రంలోని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు ప్రమాదం అంచున కొట్టుమిట్టాడుతోందని, అది ఏక్షణంలోనైనా కుప్పకూలుతుందని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ జోస్యం చెప్పారు. జిల్లా కేంద్రంలో టీజేఏసీ ఆధ్వర్యంలో జరిగిన భారీ ధర్నాలో ఆయన ప్రసంగించారు.అన్ని వర్గాల ప్రజల ఉసురుపోసుకుంటున్న ఈ ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హతలేదన్నారు. సీఎం, డీజీపీల ఆదేశాల మేరకే ఉద్యమకారులపై అక్రమ కేసులు బనాయిస్తూ ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని మండిపడ్డారు. కేసులెత్తేస్తామని అసెంబ్లీలో చెప్పి, ఒక్కో వ్యక్తిపై ఏకకాలంలో వివిధ ప్రాంతాల్లో విధ్వంసాలు సృష్టించినట్లు తప్పుడు కేసులు బనాయించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో డాక్టర్ అంబేద్కర్, రాజీవ్ గాంధీ విగ్రహాలను ధ్వంసం చేస్తే నిజమైన నిందితులను అరెస్టు చేయలేని అసమర్థ ప్రభుత్వం ఇది అని ఆయన విమర్శించారు. వస్త్రవ్యాపారంలో తెలంగాణ మొదటిస్థానంలో ఉందని, వ్యాట్‌ను ఐదుశాతం విధిస్తే ఈ వ్యాపారంపై ఆధారపడిన వారంతా నష్టపోతారన్నారు.సీఎం రోజూ పత్రికలకిచ్చే ప్రకటనలను ఆపివేస్తే వ్యాట్‌పై వచ్చే రూ.200 కోట్లు సమకూరుతాయని పేర్కొన్నారు.


