TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కిరణ్‌ మంత్రివర్గ విస్తరణఫై అధిష్టానం నీళ్లు!

Published on: Fri Dec 30, 2011 11:28AM

న్యూఢిల్లీ: మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై చర్చ జరగలేదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ గులాం నబీ ఆజాద్ తెలిపారు. ఈరోజు ఉదయం, అహ్మద్ పటేల్, ఆజాద్, ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం ఆజాద్ మాట్లాడుతూ తమ మధ్య మంత్రివర్గ విస్తరణపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు.దీంతో  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విస్తరణ ఆశలపై అధిష్టానం నీళ్లు చల్లినట్లుగా స్పష్టమైంది. కెబినెట్ విస్తరణపై ఎలాంటి చర్చ జరగలేదని తేల్చి చెప్పిన వారు ఏ అంశంపై చర్చ జరిగిందో మాత్రం పెదవి విప్పలేదు. అయితే తెలంగాణ ప్రాంతంలో ఉప ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తెలంగాణ అంశంపై చర్చ జరిగినట్లుగా ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది.

ఇటీవల కేంద్ర హోంమంత్రి చిదంబరం జనవరిలో ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే. ఉప ఎన్నికలు ఒక్క నియోజకవర్గం మినహా తెలంగాణలో జరుగుతున్నందున చిదంబరం వ్యాఖ్యలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికల్లో ఆల్ పార్టీ మీటింగ్, తెలంగాణ అంశంపై ప్రజలు ప్రశ్నించే అవకాశముంది కాబట్టి ఆల్ మీటింగ్ ఏర్పాటు చేయాలా, ఉప ఎన్నికల్లో ఏం చెప్పాలి అనే అంశంపై చర్చించినట్లు సమాచారం. సోనియాతో భేటీ అనంతరం సిఎం చిదంబరంతో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ అంశంపైనే ప్రధానంగా చర్చించారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.