కిరణ్ సర్కారుకు 'ధర్మ' సంకటం : మంత్రి డీఎల్ చెప్పినా.. !

 

 

“అది మన ప్రభుత్వానికి ఎంతమాత్రం ఆరోగ్యకరమయిన విషయం కాదు” అని ఆరోగ్యా శాఖామాత్యులు డి.యల్. రవీంద్రరెడ్డిగారు ఎంతగా మొత్తుకొంటున్నా వినకుండా, అతని హెచ్చరికలు పెడచెవినపెట్టి అధర్మం అని తెలిసికూడా సిబీఐ చార్జ్ షీట్లో పేరువేసుకొన్న తనమంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావుగారిని వెనకేసుకొస్తూ, ఆయనపై సిబీఐ ప్రాసిక్యూషన్ చేయడానికి అనుమతి నిరాకరిస్తూ కాబినెట్ లో నిర్నయించేసి, ‘మేము సంతకాలు పెట్టేసాక గవర్నర్ సంతకం చేయక చస్తాడా?’ అనుకొంటూ నిర్భయంగా ఆ ఫైలును ఆయన ఆమోదం కోసం పంపించేరు విజ్ఞులయిన మన ముఖ్యమంత్రి గారు.

 

ఆ ఫైలు ఆయన చేతిలో పడినప్పటినుండీ ఆయనకు రాహుకాలం మొదలయినట్లయింది. ఆయన హైదరాబాదులో ఉంటె విపక్షాలు మరియు తెలంగాణా వాదులూ, డిల్లీ వెళ్తే అక్కడ మీడియా వాళ్ళు ‘మీరలా ఆ ఫైలుని కోడి గుడ్లు పొదిగినట్లు పొదుగుతూ ఎన్ని రోజులు కూర్చోంటారంటూ’ ఆయనపై దాడిచేస్తుంటే ఆబాధ బరిన్చలేకో మరేమో గానీ, దానిని మళ్ళీ కిరణ్ సర్కారుకే తిప్పి పంపేసారు “మీ తిప్పలు మీరు పడండి’ అంటూ. "మళ్ళీ మీరు నాకా ఫైలు పంపేముందు కనీసం ఈసారయినా న్యాయనిపుణుల సలహా తీసుకోమని" ఒక నోట్ (ఉచిత సలహా) కూడా దానిపైన బరబారా వ్రాసేసి చేతులుదులుపుకొని ‘హమ్మయ్యా!’ అని ఊపిరితీసుకొన్న గవర్నర్ గారు మళ్ళీ సోనియమ్మ పిలపందుకొని హడావుడిగా డిల్లీ బయలుదేరిపోయారు.

 

గోడకోట్టిన బంతిలా వెనక్కొచ్చిన ఆ ఫైలుని చూసి కిరణ్ కుమార్ రెడ్డి తలపట్టుకొంటే, వెనకనుండి “చూసారా... నేను ఆ రోజే మరీమరీ చెప్పినా వినకుండా పంపేరు..” అంటూ మన డి.యల్. రవీంద్ర రెడ్డి గారు సన్నాయి నొక్కులు నొక్కతూ ముసిముసి నవ్వులు చిందిస్తూ కనిపించేరు.

 

మరో గంటో గడియలోనో అయన ‘ధర్మాన ఫైలు మరియు న్యాయసూత్రాలు’ అనే అంశంపై చర్చించేందుకు మన టీవీ తెరలపైకి రాబోతున్నారు.