పిసిసి ఇలాఖాను కాపాడుతున్న సీఎం
Published on: Wed Feb 8, 2012 2:11PM
విశా
ఖపట్నం: పదవిని కాపాడుకోవడానికే సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు చెందిన విజయనగరం జిల్లాలోని మద్యం సిండికేట్లపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) దాడులు చేయించడం లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తనకు 31 మద్యం దుకాణాలున్నాయని బొత్స సత్యనారాయణ చెప్పారని, అయినా చర్యలు తీసుకోవడం లేదని ఆయన అన్నారు. ఎసిబి దాడులు కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితమయ్యాయని ఆయన అన్నారు. మద్యం సిండికేట్ల నుంచి లంచం తీసుకున్న ఆబ్కారీ మంత్రి మోపిదేవి వెంకట రమణ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని ఆయన అన్నారు. కాంగ్రెసు నాయకులు జిల్లాలవారీగా వందలాది మద్యం షాపులు తీసుకున్నారని ఆయన అన్నారు.


