అబ్బ! మళ్ళీ దెబ్బెసేసాడు మనోడు

 

ఒక సిద్దాంతానికో నియమానికో కట్టుబడేవి కావు మన రాజకీయాలు, అయినా కట్టుబడిఉన్నట్లు అందరినీ భ్రమింపజేస్తాయి. అలా భ్రమింపజేయడమే రాజకీయం. ఇక సమైక్యాంధ్ర చాంపియన్ షిప్ ట్రోఫీ రేసులో అందరి కంటే ముందున్న కిరణ్, జగన్లు కూడా ఈ రాజకీయాలకు అతీతులు కారు. సమైక్యాంద్ర వాదనలతో కిరణ్ కుమార్ రెడ్డి తన రేటింగ్స్ పెంచుకొనేందుకు కష్టపడుతుంటే, సమైక్యాంద్ర సెంటిమెంటుతో సీమాంద్రాలో తన పార్టీని బలోపేతం చేసుకొని అధికారంలోకి రావాలని జగన్ ఆశపడుతున్నాడు.

 

కానీ పోటీలో ఒకరు గెలవాలంటే ప్రత్యర్ధిని తప్పనిసరిగా ఓడించాలి. అందుకు ఏదో ఒకటి చేయక తప్పదు మరి. దానిని భరించాలంటే చాలా స్పోర్టివ్ స్పిరిట్ ఉండాలి. రేపు హైదరాబాదులో సమైక్య శంఖారావం పూరించి సీమాంద్రాపై మరింత పట్టు సాధించుకోవాలని జగన్ ఆలోచిస్తే, అతనికంటే నాలుగాకులు ఎక్కువ చదివిన కిరణ్ కుమార్ రెడ్డి రెండేళ్ళ క్రితం పెరట్లో పడేసిన ‘రచ్చబండ’ని మళ్ళీ దులిపి సిద్దం చేసుకొని ఆ మిషతో ప్రజలను మంచి చేసుకొనేందుకు రెడీ అవుతున్నారు. అది కూడా ఒట్టి చేతులతో కాకుండా సామాన్య ప్రజలు ఆశించే రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్ళు వంటి తాయిలాలను పట్టుకొని మరీ బయలు దేరుతున్నారు.

 

కుండపోతగా కురుస్తున్న వానల మధ్య సమైక్య శంఖారవం పూరించడానికి వీలవుతుందో లేదో, ఇంతా కష్టపడి ఊపిరి బిగబట్టి గట్టిగా శంఖం ఊదినా అది జనాలకి వినబడుతుందో లేదో అని దిగులుపడుతున్న వైకాపాకి, కిరణ్ కుమార్ రెడ్డి ఈసారి తమని ఏకంగా రచ్చబండతో కొట్టడంతో కంగు తిన్నారు.

 

సీమాంద్రాలో ఎలాగోలా నెగ్గుకు రావచ్చును. కానీ, మళ్ళీ తెలంగాణాలో మూసేసిన దుఖాణం తెరవాలంటే ఈ శంఖారావం చాలా అవసరమని వైకాపా భావిస్తుంటే, కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ అదే రచ్చబండతో అక్కడి మంత్రులతో వైకాపాకు కౌంటర్ ఇప్పించే వెసులుబాటు ఉంచుకోవడం కలవరపరుస్తోంది. తెలంగాణా సాధించింది తామేనని, కేవలం తమ పార్టీయే మొట్ట మొదటి ప్రభుత్వం ఏర్పాటు చేయగలదని వారు రచ్చబండ మీద నిలబడి మరీ టాం టాం చేసుకొంటూ పనిలోపనిగా అక్కడి జనాలకు కూడా వారు తాయిలాలు పంచి పెట్టి మంచి చేసుకోవచ్చును.

 

ఇంత జడివానలో తడిసి ముద్దవుతూ అష్టకష్టాలు పడినా దక్కని ఫలం, ఈ ముఖ్యమంత్రి, ఈ కాంగ్రెస్ నేతలు రచ్చబండ దగ్గిర కులాసాగా నాలుగు కబుర్లు చెప్పి, జనాలకి తాయిలాలు పంచిపెట్టి సంపాదించుకోవాలని ప్రయత్నించడం చాలా అన్యాయమని వైకాపా ఆక్రోశిస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒకవైపు సమైక్యవాదం చేస్తూనే మరోవైపు ప్రజలను సమైక్యం నుండి పక్కదారి పట్టించడానికే ఈ రచ్చబండ కబుర్లు చెప్పడానికి వస్తున్నారని వైకాపా ఆరోపణ.

 

స్పోర్టివ్ స్పిరిట్ లేకపోవడమంటే మరి ఇదే. అయితే యుద్దంలో గెలుపే ముఖ్యం తప్ప అందుకు ఎంచుకొన్న మార్గాలు ముఖ్యం కాదని అర్ధం అవుతోంది. ఇప్పుడు ముఖ్యమంత్రి తమ మెడకు రచ్చబండను గుదిబండగా తగిలిస్తే, దానిని వదిలించుకొని మళ్ళీ జీవితాన్నే మార్చేసే మరో సరి కొత్త ఐడియా కోసం వైకాపా ఆలోచించక తప్పదు. చివరికి ఇద్దరిలో సమైక్య ట్రోఫీ ఎవరికి దక్కుతుందో చూడాలి.