కాంగ్రెస్ పార్టీకి కిరణ్, జగన్ రెండు కళ్ళు

 

ఇంత కాలంగా అధిష్టానం నిర్ణయాన్ని సవాలు చేస్తూ చాలా గట్టిగా సమైక్యవాదం వినిపించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఇప్పుడు ఉద్యోగుల సమ్మెను విరమింపజేయడం చూస్తే ఆయన అధిష్టానం హెచ్చరికలకు వెనక్కి తగ్గినట్లే ఉంది. అసలు కిరణ్ కుమార్ రెడ్డి నిజంగా రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తున్నందునే అధిష్టానాన్ని దిక్కరిస్తున్నారా? లేక కాంగ్రెస్ అధిష్టానం వ్యూహంలో భాగంగానే కిరణ్ కుమార్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కూడా సమైక్య డ్రామాను రక్తి కట్టిస్తున్నారా అనే అనుమానాలున్నాయి.

 

ఎందుకంటే, శాసనసభకి తెలంగాణా బిల్లు రాదని తెలియకనే, ఆయన ఇంత కాలం బిల్లుని ఓడిస్తామని చెపుతున్నారని భావించలేము. అంటే బిల్లు రాదని తెలిసినప్పటికీ అదేమి తెలియనట్లు నటిస్తూ ఇంత కాలం ఆయన సమైక్యవాదం చేస్తునట్లు అర్ధం అవుతోంది. మిగిలిన మంత్రులు, శాసన సభ్యులు కూడా ఆయన అడుగు జాడలలోనే నడుస్తున్నారు. గనుక అందరూ ఆ తానులో ముక్కలేనని అర్ధం అవుతోంది. అంటే చాలా ముందుగానే సిద్దం చేసుకొన్నఈ సమైక్య స్క్రిప్ట్ ప్రకారమే ఈ సమైక్య డ్రామా నడుస్తోందని చెప్పవచ్చును.

 

అందుకు కారణం ఏమిటంటే రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంద్రాలో తనకు తీవ్ర వ్యతిరేఖత ఎదురయితే, అది తెలుగుదేశం పార్టీకి లాభం చేకూర్చుతుందని కాంగ్రెస్ పార్టీకి తెలుసు. అందుకే కిరణ్ కుమార్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిలతో సమాంతరంగా ఈ సమైక్య డ్రామా నడిపిస్తోంది. ఇదే నిజమయితే త్వరలో ఆయనని బలవంతంగా పదవి నుండి దింపో లేక ఆయనే టీ-నోట్ ను వ్యతిరేఖిస్తూ పదవికి, పార్టీకి కూడా రాజీనామా చేసి కొత్త సమైక్య పార్టీని పెట్టడమో జరుగుతుంది.

 

అప్పుడు తెలుగుదేశం పార్టీ ఒకవైపు సమైక్య హీరోగా బయటకి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డిని, మరో వైపు సమైక్యంద్రా ఏకైక హక్కుదారుగా చెప్పుకొంటున్నజగన్మోహన్ రెడ్డిని డ్డీ కొనవలసి ఉంటుంది. వారిద్దరూ రంగంలోకి దిగితే, ప్రజలు ఆ ఇద్దరు సమైక్య హీరోలకే ఓటువేసే అవకాశం ఎక్కువ ఉంటుంది.

 

గత ఎన్నికలలో ప్రజారాజ్యం వచ్చి ఇదేవిధంగా ఓట్లు చీల్చడంతో తెదేపా దెబ్బతింది. మళ్ళీ ఈసారి కూడా కాంగ్రెస్ అధిష్టానం అదే వ్యూహం అమలు చేస్తున్నట్లు కనబడుతోంది. ఆ తరువాత ప్రజారాజ్యం పార్టీ ఏవిధంగా కాంగ్రెస్ గంగలో కలిసిపోయిందో ఈ సారి కూడా ఎన్నికల తరువాత కిరణ్ పెట్టబోయే కొత్త పార్టీ, వైకాపా కూడా కాంగ్రెస్ లో కలిసిపోవచ్చును.

 

ఒకవేళ వైకాపా కలవకపోతే ఆ పార్టీతో కలిసి రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ కి అభ్యంతరం ఉండకపోవచ్చును. ఎందుకంటే, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం కంటే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికే కాంగ్రెస్ అధిక ప్రాదాన్యత ఇస్తుంది. ఈ అంచనా నిజమయితే కాంగెస్ పార్టీకి కూడా కిరణ్, జగన్ ఇద్దరూ రెండు కళ్ళవంటి వారని చెప్పవచ్చును.