TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విస్తరణకు అధిష్టానం నో..చిరంజీవికి మొండిచెయ్యేనా!

Published on: Fri Dec 30, 2011 12:45PM

హైదరాబాద్: కిరణ్ కెబినెట్ విస్తరణపై అధిష్టానం నో చెప్పింది. చిరంజీవి వర్గానికి మంత్రి పదవులపై కూడా వెనక్కి వెళ్లినట్లుగా తెలుస్తోంది. చిరంజీవి వర్గానికి చెందిన ఇద్దరికి అధిష్టానం మంత్రి పదవులు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. శాసనమండలి సభ్యుడు సి.రామచంద్రయ్య, శాసనసభ్యుడు గంటా శ్రీనివాస రావుల పేర్లను చిరు వర్గం ప్రతిపాదించింది. సి.రామచంద్రయ్యకు మంత్రి పదవి ఇవ్వడాన్ని కడప జిల్లాకు చెందిన నేతలు వ్యతిరేకిస్తున్నారట. అతనికి మంత్రి పదవి ఇస్తే పార్టీని వీడేందుకు కూడా వెనుకాడమని అధిష్టానానికి పలువురు జిల్లా నేతలు చెప్పినట్లుగా సమాచారం. జిల్లా కాంగ్రెసు మొత్తం రామచంద్రయ్యను వ్యతిరేకిస్తున్నట్లుగా సమాచారం. ఇక ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావుపై జార్ఖండులోని ధన్‌బాద్‌లో కోల్ మైనింగ్ కేసు ఉందని సమాచారం. ఇరువురిపై పలువురు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో చిరు ప్రతిపాదించిన ఆ ఇద్దరిని కేబినెట్లోకి తీసుకునేందుకు అధిష్టానం విముఖత చూపినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి చిరంజీవి వర్గం మరికొంత కాలం వేచిచూడాల్సిన పరిస్థితి వచ్చింది.