TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కింగ్ ది కోహ్లీ.. రికార్డుల రారాజు

Published on: Thu May 14, 2026 9:08AM

 

ఐపీఎల్ లో   స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకున్నాడు. బుధవారం రాయ్‌పూర్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తో జరిగిన మ్యాచ్‌ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ స్టార్ ప్లేయర్ కోహ్లీకి  279వ మ్యాచ్. దీనితో ఐపీఎల్  చరిత్రలోనే అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ పేరు మీద సంయుక్తంగా  ఉండేది. వీరిద్దరూ తలో 278 మ్యాచ్‌లతో కోహ్లీతో సమానంగా ఉండగా, తాజా మ్యాచ్‌తో విరాట్ వీరిద్దరినీ అధిగమించాడు. 

ఐపీఎల్ అంటేనే రికార్డుల వేదిక, అలాంటిది ఈ మెగా టోర్నీలో మోస్ట్ క్యాప్డ్ ప్లేయర్‌గా నిలవడం సామాన్యం కాదు. ఎంఎస్ ధోనీ ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ స్క్వాడ్‌లో ఉన్నప్పటికీ ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ  మైదానంలోకి దిగలేదు. మరోవైపు రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నాడు. వీరిద్దరినీ వెనక్కి నెట్టి విరాట్ కోహ్లీ ఈ సరికొత్త శిఖరాన్ని చేరుకున్నాడు. రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ కోహ్లీ కెరీర్‌లో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. కేవలం ఒకే ఫ్రాంచైజీ తరపున ఇన్ని మ్యాచ్‌లు ఆడటం కోహ్లీ అంకితభావానికి నిదర్శనంగా చెప్పవచ్చు. 

ఇక పోతే ఇదే మ్యాచ్ లో కోహ్లీ అజేయ సెంచరీతో విశ్వరూపం చూపాడు. ఈ క్రమంలో మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. టి20 హిస్టరీలోనే 14 వేల పరుగులు చేసిన తొలి ఇండియన్ క్రికెటర్ గా నిలిచాడు. మొత్తంగా టీ20ల్లో 14 వేల పరుగులు పూర్తి చేసిన ఆరవ బ్యాటర్ గా కోహ్లీ నిలిచాడు. ఇక పోతే అత్యంత వేగంగా టి20 14 వేల పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కోహ్లీ ఈ మార్క్ ను 409 ఇన్నింగ్స్ లో సాధించాడు.