కూల్చివేతతో జగన్ పాలన ప్రారంభం.. 9 కోట్ల ప్రజాధనం మట్టిపాలు

ఏపీ టీడీపీ అధ్యక్షులు కళా వెంకట్రావు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. శుభకార్యంతో పాలన ప్రారంభించకుండా ప్రజావేదిక కూల్చివేతతో జగన్ పాలన ప్రారంభించారని విమర్శించారు. ప్రజావేదిక కూల్చి రూ.9 కోట్ల ప్రజాధనం మట్టిపాలు చేశారని మండిపడ్డారు. 

"అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో పండ్ల చెట్లు నరికి వేశారు. కావలిలో ఉపరాష్ట్రపతి ప్రారంభించిన శిలాఫలకాన్ని కూల్చివేశారు. విజయవాడలో అవతార్ పార్క్ ను ధ్వంసం చేశారు. అనంతపురం జిల్లా పేరూరులో చంద్రబాబు శిలాఫలకం ధ్వంసం చేశారు. నెల్లూరులో పేదల ఇళ్లను కూల్చివేశారు. మడకశిరలో ఇళ్లు కూల్చివేశారు. మాచర్లలో ఇళ్లు కూల్చివేశారు. నర్సరావుపేటలో అన్న క్యాంటీన్ కూల్చి వేశారు." అంటూ వైసీపీ ప్రభుత్వ కూల్చివేతల చిట్టాను కళా వెంకట్రావు చెప్పుకొచ్చారు.

ఆస్తులు కూల్చి వేయడం, శిలా ఫలకాలు కూల్చివేయడం, భూములు, గనులు కబ్జా చేయడం, ప్రశ్నించిన ప్రతిపక్షాలపైన, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ అరెస్ట్ లు, వేధింపులు నిత్యకృత్యమయ్యాయని కళా వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు కూల్చివేసిన ప్రజావేదికను సందర్శించడానికి వెళ్తున్న వర్లరామయ్య, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, ఆలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనంద్ బాబు, తెనాలి శ్రావణ్ కుమార్,అశోక్ బాబు, బచ్చుల అర్జునుడు, పిల్లి మాణిక్యారావు తదితర నాయకుల అక్రమ అరెస్ట్ లను ప్రజలు, మేధావులు ఖండించాలని కళా వెంకట్రావు కోరారు.