మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌కి చంపేస్తామంటూ ఫోన్లు..
Published on: Thu Sep 18, 2014 10:02AM

సికింద్రాబాద్ నియోజకవర్గం మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్‌కి గత కొన్ని రోజులుగా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఆ బెదిరింపు కాల్స్ చేసినవాళ్ళు అంజన్‌కుమార్ని చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. దాంతో ఠారెత్తిపోయిన అంజన్ కుమార్ యాదవ్ హుస్సేనీ ఆలం పోలీసులకు ఆగస్టు 31న ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదు మీద కేసు నమోదు చేయాలా వద్దా అని పోలీసులు తర్జనభర్జన పడ్డారు. ఆ సందేహంతోనే హుస్సేనీ ఆలం పోలీసులు నాంపల్లిలోని చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టును ఆశ్రయించారు. ఈ అంశాన్ని పరిశీలించిన కోర్టు కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఐపీసీ సెక్షన్ 507 కింద కేసు నమోదు చేసిన హుస్సేనీ ఆలం పోలీసులు అంజన్ కుమార్ యాదవ్‌కి బెదిరింపు కాల్స్ ఎక్కడినుంచి వస్తున్నాయన్న అంశం మీద దర్యాప్తు ప్రారంభించారు.


