సోషల్ మీడియా సాక్షిగా … మనల్ని వెక్కిరిస్తున్న కికి కిరికిరి!

రాష్ట్రంలో ఒకవైపు గ్రీన్ ఛాలెంజ్ నడుస్తోంది. రాష్ట్ర మంత్రులు మొదలు సినిమా సెలబ్రిటీల వరకూ మొక్కలు నాటి సవాళ్లు విసురుతున్నారు. ఒకర్ని చూసి ఒకరు పచ్చదనం పెంచే మంచి పని చేస్తున్నారు! కేటీఆర్, మహేష్ బాబు లాంటి వారు ఛాలెంజ్ కు సై అనటంతో మీడియాలో కోలాహలం బాగానే వుంది! అయితే, సాక్షాత్తూ ప్రధాని మోదీ ఆ మధ్య ఫిట్ నెస్ ఛాలెంజ్ స్వీకరించారు! విరాట్ కోహ్లీ ఇచ్చిన సవాలుని తీసుకుని ఆయన ఎక్సర్సైజులు , యోగాసనాలు వంటివి చేసి వీడియో అప్ లోడ్ చేశారు. అయితే, ఆయన కర్ణాటక సీఎం కుమారస్వామిని నామినేట్ చేయటం కొంత గొడవకు దారితీసింది! కానీ, ఏ విధంగా చూసినా ఫిట్ నెస్ ఛాలెంజ్ లు, గ్రీన్ ఛాలెంజ్ లు మంచివే! హానికరమైతే అస్సలు కావు! సోషల్ మీడియా వచ్చేసి ఇప్పుడు ఏదైనా వైరల్ అయిపోతోంది. తాను చేసే పని వైరల్ ఎఫెక్ట్ కలదని ఒక్కోసారి సదరు వ్యక్తికే తెలియకపోవచ్చు కూడా! అలా తయారైంది నెట్ ప్రపంచం! ఫేస్బుక్, వాట్సప్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్… ఇలా బోలెడు వేదికలు ఇప్పుడు జనాన్ని ప్రపంచంతో కనెక్ట్ చేస్తున్నాయి! అయితే, అదే సమయంలో నానా రచ్చకి కూడా పదే పదే కారణం అవుతున్నాయి! అటువంటి కిరికిరి వ్యవహారమే కికి ఛాలెంజ్!

 

 

ఏంటి ఈ కికి ఛాలెంజ్ ? దాని సంగతి తరువాతగానీ… ముందసలు ఈ ఛాలెంజ్ వల్ల పోలీసుల దృష్టిలో పడ్డది ఎవరో తెలుసా? సౌతిండియాలో కాస్తో కూస్తో పేరున్న రెజీనా, అదా శర్మా లాంటి సినిమా సెలబ్రిటీలు! ఈ హీరోయిన్స్ కి సోషల్ మీడియాలో కొన్ని లక్షల మంది ఫాలోయింగ్ వుంటుంది. అయినా వీరు నిర్లక్ష్యంగా కికి ఛాలెంజ్ అంటూ తిక్క పనులు చేశారు. నడుస్తున్న కార్ లోంచి దూకి… నాలుగు గెంతులు గెంతి ఎగిరొచ్చి కార్లో కూర్చున్నారు! ఇదేనట… కికి ఛాలెంజ్!

 

 

నడుస్తున్న వాహనంలోంచి కిందకు దూకడం ప్రాణంతకం! ఇది కూడా తెలియదా మన సెలబ్రిటీలకు? పైగా అదొక ఛాలెంజ్ అంటూ ప్రచారం చేసి మరోకర్ని రొచ్చులోకి లాగటం! ఏమైనా బుద్దున్న పనేనా? అసలు ఈ కికి కిరికిరి సహజంగానే వెస్టన్ కంట్రీస్ లో మొదలైంది. అక్కడున్న షిగ్గీ అనే ఓ కమెడియన్ రోడ్డు పక్కన డ్యాన్స్ చేసి… దానికి కికి ఛాలెంజ్ అనే పేరు పెట్టి ఇన్ స్టాగ్రామ్ లో వదిలాడు. కికి అతగాడి మాజీ గాళ్ ఫ్రెండ్ పేరు! అయితే, ఆ కమెడియన్ కార్ లోంచి దూకలేదు. ఊరికెనే డ్యాన్స్ చేశాడు. కానీ, ఆ కికి చాలెంజ్ ను చూసిన కొందరు పని లేని టీనేజర్లుకు అందులో కిక్ యాడ్ చేద్దామనిపించింది! అదుగో ఆ పైత్యం నుంచీ మొదలైందే కార్లోంచి కిందకు దిగి డ్యాన్స్ లు ఆడి మళ్లీ ఎక్కడం! ఇప్పటికే పాశ్చాత్య దేశాల్లో ఈ కికి దెబ్బకి చాలా మందికి దెబ్బలు తగిలాయి. కార్లోంచి దిగేటప్పుడో, ఎక్కేటప్పుడో కిందపడుతున్నారు. మెదడు వంటి అంగాలకు దెబ్బలు తగిలి ఠపా కడుతున్నారు కూడా!

 

 

 

తెల్లోళ్లు ఏం చేస్తే అది చేయాలని తపించిపోయే ఇండియన్స్ … మరీ ముఖ్యంగా కొందరు సెలబ్రిటీలు ఇప్పుడు కికి అంటూ బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. వీరు వెనకా ముందు ఆలోచించకుండా కార్లోంచి దూకి డ్యాన్స్ చేసి మళ్లీ ఎగిరొచ్చి లోపల కూర్చుంటున్నారు. దాన్ని చూసి చాలా వరకూ టీనేజర్లు తామూ ప్రయత్నిస్తున్నారట. టీనేజ్ వాళ్లే ఇలాంటి పనులు చేయటానికి కారణం వారిలో వుండే డోపమైన్ అనే హార్మోన్ కారణమట! అది టీనేజ్ లో ఎక్కువగా విడుదల అవుతుండటంతో ఎక్కడలేని ఉత్సాహం, అతి విశ్వాసం కలుగుతాయట. వాటి కారణంగా కదిలే కార్ లోంచి దూకినా తమకు ఏమీ కాదని భావిస్తారని సైకాలజిస్టులు చెబుతున్నారు. అంతే కాక ఇలాంటి తాత్కాలిక దుస్సాహసలు చేసి తాము ప్రత్యేకం అని నిరూపించుకునే తొందర కూడా వారిలో వుంటుందట!

 

 

ఈ కికి ఛాలెంజ్ కొత్తగా వచ్చిందేమో కానీ… చాలా మందికి ట్రైన్లలో, బస్సుల్లో ఫుట్ బోర్డ్ పైన టీనేజర్లు చేసే విన్యాసాలు మామూలే! కదులుతున్న ట్రైన్ల నుంచీ బయటకు దూకి తిరిగి ఎక్కుతుంటారు కొందరు యువకులు! వారి దృష్టిలో అదో పెద్ద ప్రపంచం విజయం! ఇలాంటివి పేరెంట్స్ జాగ్రత్త పడకపోతే ప్రాణాలు మీదకు వచ్చే అవకాశాలు పుష్కలం. కేవలం పిలల్ని కనేసి, వారికి డబ్బులు ఇచ్చేసి రోడ్లపై వదిలేస్తే కికి ఛాలెంజ్ కాకపోతే మరోటి రానే వస్తుంది. బలి తీసుకుని వెళ్లిపోతుంది. తరువాత తల్లిదండ్రులు ఎంత ఏడ్చినా వృథా! అందుకే, సోషల్ మీడియా ప్రభావం నుంచీ, సెలబ్రిటీలు చేసే పిచ్చి పిచ్చి ఛాలెంజ్ ల నుంచీ ఎవరి పిల్లల్ని వారే కాపాడుకోవాలి. ముందసలు పెద్దలు సోషల్ మీడియా, సెలబ్రిటీల ఆకర్షణ నుంచీ బయటపడాలి. తమ టీనేజర్లకి, యూత్ కి ఏది చేస్తే మంచో, ఏది కాదో, ఏది అనవసరమో, ఏది ప్రాణంతకమో వివరించాలి. అదొక్కటే కికి లాంటి కిరికిరీలకు పరిష్కారం!