ట్రాఫిక్తో పిల్లల డీఎన్ఏ దెబ్బతింటోంది

 

కాలుష్యం గురించి కొత్తగా చెప్పుకొనేదేముంది. సరికొత్తగా తిట్టుకునేదేముంది. కాలుష్యంతో ఊపిరితిత్తులు దెబ్బతింటాయనీ, కాలుష్యకణాలు ఏకంగా మెదడులోకి చొచ్చుకుపోతాయని పరిశోధనలు రుజువుచేస్తున్నాయి. ఫలితంగా ఆస్తమా మొదల్కొని అల్జీమర్స్ దాకా నానారకాల సమస్యలూ తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. తాజాగా ఓ పరిశోధనతో కాలుష్యం ఏకంగా పిల్లల డీఎన్ఏ దెబ్బతినే ప్రమాదం ఉందని తేల్చింది.

 

పిల్లల డీఎన్ఏ మీద కాలుష్య ప్రభావం తెలుసుకొనేందుకు పరిశోధకులు కాలిఫోర్నియాలోని Fresno అనే నగరాన్ని ఎంచుకొన్నారు. అమెరికాలోని అత్యంత కాలుష్యపూరిత నగరాల్లో Fresno ముందువరుసలో ఉండటమే ఇందుకు కారణం! దీనికోసం ఈ నగరంలో నివసించే కొందరు పిల్లలు, కుర్రవాళ్లకి సంబంధించిన డీఎన్ఏను పరిశీలించారు. మోటరు వాహనాల నుంచి వెలువడే polycyclic aromatic hydrocarbons (PAHs) అనే కాలుష్య కణాలు ఎక్కువైనప్పుడు, వారి డీఎన్ఏలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో అంచనా వేశారు.

 

వాతావరణంలో PAH కణాలు ఎక్కువగా ఉన్నప్పుడు, డీఎన్ఏలో ఉండే telomere అనే భాగం కుంచించుకుపోతున్నట్లు తేలింది. ఆస్తమా ఉన్న పిల్లలలో ఈ ప్రభావం మరింత తీవ్రంగా కనిపించింది. మన వయసు పెరుగుతూ వృద్ధాప్యం మీద పడేకొద్దీ ఈ telomere తగ్గిపోవడం సహజం. ఒకరకంగా ఈ telomere మనం మరణానికి చేరువవుతున్నామనేదానికి సూచనగా నిలుస్తుంది. అందుకనే కేన్సర్ వంటి వ్యాధులు వచ్చినప్పుడు కూడా ఈ telomere తగ్గిపోతుంటుంది.

 

పిల్లల్లో రోగనిరోధకశక్తి చాలా తక్కువగా ఉంటుంది. దానికి తోడు వారి అవయవాలు సున్నితంగా, చిన్నగా ఉంటాయి. వారి డీఎన్ఏలోని telomere కూడా అంతే సున్నితంగా ఉంటుంది. దాంతో ట్రాఫిక్ నుంచి వచ్చే కాలుష్యం వారిని మరింతగా పీడించే ప్రమాదం ఉంటుంది. ఈ విషయాన్నే పై పరిశోధన రుజువు చేసింది. కానీ ఈ పరిస్థితి నుంచి భావితరాలను కాపాడేందుకు ఏ వ్యవస్థా ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడమే దురదృష్టం. ఇక మనమే మన పిల్లల్ని ఎలాగొలా ఈ కాలుష్యం బారిన పడకుండా చూసుకోవాలి.

- నిర్జర.