లాలూకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్.. దాత కుమార్తే!
Published on: Fri Nov 11, 2022 9:30AM
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) వ్యవస్థాపకుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు కిడ్నీ మార్పిడి జరగనుంది. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న లాలూ ప్రసాద్ యాదవ్ కు రెండు కిడ్నీలూ ఫెయిలయ్యాయి. దీంతో ఆయనకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ అవసరమని వైద్యులు తెలిపారు. దీంతో కిడ్నీ దాతల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ స్థితిలో ఆయన రెండో కుమార్తె రోహిణీ ఆచార్య తన తండ్రికి కిడ్నీ దానం చేయడానికి ముందుకు వచ్చారు.
ప్రస్తుతం ఆమె సింగపూర్ లో నివసిస్తున్నారు. చాలా కాలం నుంచీ మూత్ర పిండాల సమస్యతో బాధపడుతున్న లాలూ ప్రసాద్ యాదవ్ కు కిడ్నీ మార్పిడి అవసరం లేదని ఎయిమ్స్ వైద్యులు చెప్పినప్పటికీ సెకండ్ ఒపీనియన్ కోసం అన్నట్లుగా ఆయన కుమార్తె రోహిణీ ఆచార్య తన తండ్రిని సింగపూర్ లోని ఓ ఆసుపత్రిలో చూపించి పరీక్షలు చేయించారు. అక్కడి వైద్యులు కిడ్నీ మార్పిడి చేయించుకుంటే ఆరోగ్యం మెరుగవుతుందని చెప్పారు.
దీంతో లాలూ ప్రసాద్ యాదవ్ కు కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయించేందుకే ఆయన కుటుంబ సభ్యలు నిర్ణయించారు. కిడ్నీ దానం చేయడానికి ఆయన రెండో కుమార్తె రోహిణీ ఆచార్య ముందుకు వచ్చారు. తన తండ్రికి తన ఇవ్వగలుగుతున్నందుకు తనకెంతో గర్వంగా ఉందని ఆమె అన్నారు.
బహుశా ఈ నెలాఖరులోగా లాలూప్రసాద్ యాదవ్ కు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ జరుగుతుంది. పశుగ్రాస కుంభకోణం కేసులో జైలు పాలైన లాలూ ప్రసాద్ యాదవ్ ఇటీవలే బెయిలుపై బయటకు వచ్చిన సంగతి విదితమే.


