కొడంగల్ లో కలకలం.. కాంగ్రెస్ అభ్యర్థి కిడ్నాప్

 

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి ముగిసి గ్రామ పంచాయతీ ఎన్నికల హడావుడి మొదలైన విషయం తెలిసిందే. ఓ వైపు గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థుల ఎంపిక, నామినేషన్లతో పార్టీలు బిజీగా ఉంటే.. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో మాత్రం సర్పంచ్ అభ్యర్థి కిడ్నాప్ కలకలం రేపుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ అభ్యర్థి విశ్వనాథ్‌ ఇంట్లో నిద్రిస్తుండగా బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. నిటూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా విశ్వనాథ్ నేడు నామినేషన్ వేయాల్సి ఉంది. నామినేషన్ దాఖలుకు నేడు ఆఖరి రోజు కావడంతో ఆయన నామినేషన్‌ను అడ్డుకునేందుకే కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. తన నియోజవర్గంలో తన పార్టీ సర్పంచ్ అభ్యర్థి కిడ్నాప్ అయ్యారన్న సమాచారం తెలుసుకున్న కాంగ్రెస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి హుటాహుటిన నిటూరు గ్రామానికి చేరుకున్నారు. విశ్వనాథ్ కుటుంబ సభ్యుల నుంచి సమాచారం తెలుసుకుని, కిడ్నాప్ వ్యవహారంపై ఎస్పీ అన్నపూర్ణకు ఫిర్యాదు చేశారు. రేవంత్ ఫిర్యాదుతో పోలీసులు గ్రామానికి చేరుకుని.. విశ్వనాథ్‌ను నామినేషన్ వేయకుండా ఆపేందుకే కిడ్నాప్ చేశారా? లేక ఇంకేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.