మంత్రి కిడారి శ్రావణ్ తో రాజీనామా చేయించండి: గవర్నర్
Published on: Wed May 8, 2019 11:10AM

ఏపీ వైద్య, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చట్టసభల్లో సభ్యుడు కాని ఆయన గతేడాది నవంబరు 11న చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన తండ్రి, అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు హత్య చేయడంతో శ్రావణ్‌కు మంత్రిగా అవకాశం లభించిన విషయం తెలిసిందే.
అయితే.. రాజ్యాంగ నియమావళి ప్రకారం.. మంత్రిగా నియమితులైన వారు ఆరు నెలల్లోగా చట్ట సభకు ఎన్నిక కావాలి. శ్రావణ్‌కు ఆరునెలల వ్యవధి ఈ నెల 10తో ముగుస్తుంది. 11 నుంచి ఆయన మంత్రిగా కొనసాగడానికి వీల్లేదు.
ఏపీలో గత నెల 11న జరిగిన ఎన్నికల్లో ఆయన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే ఫలితాలు మే 23 న వెలువడనున్నాయి. మరోవైపు శ్రావణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి.. పదో తేదీతోనే ఆరునెలల గడువు ముగుస్తుండడంతో రాజ్‌భవన్ అప్రమత్తమైంది. ఒక మంత్రి చట్ట సభల సభ్యుడు కాలేక పదవి కోల్పోవడం అవమానకరంగా ఉంటుందని.. అందువల్ల పదో తేదీలోపే శ్రావణ్‌తో మంత్రి పదవికి రాజీనామా చేయించాలని గవర్నర్ నరసింహన్ సీఎం చంద్రబాబుకు సూచించినట్లు సమాచారం.


