ఖమ్మం జిల్లాలో బుల్లి సోను సూద్!
Published on: Wed Feb 3, 2021 9:35AM
సోనుసూద్... సినిమాల్లో ఎక్కువగా విలన్ గా నటించే సోనుసూద్.. నిజ జీవితంలో మాత్రం రియల్ హీరోనే. తన సేవాగుణంతో దేశ వ్యాప్తంగా ప్రజల అభిమానం చూరగొంటున్నారు ఈ పాన్ ఇండియా యాక్టర్. కొవిడ్ సంక్షోభ సమయంలో పేదలకు అండగా నిలిచారు సోనుసూద్. ప్రత్యేక బస్సులు, రైళ్లు, విమానాలు ఏర్పాటు చేసి వేలాది మంది వలస కూలీలను ఇంటికి చేర్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి శస్త్రచికిత్సలు చేయించారు. అవసరమున్న వారికి తన వంతు సాయం చేస్తూ అందరి చేత శభాష్ అనిపించుకున్నారు.
దేశంలో ఏదో ఒక ప్రాంతానికో పరిమితం కాలేదు సోనుసూద్ సేవలు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎవరూ కష్టాల్లో ఉన్నా.. తన దృష్టికి వచ్చిన వెంటనే స్పందిస్తూ గొప్ప మనుసు చాటుకుంటున్నారు సోనుసూద్. తెలుగు రాష్ట్రాల్లోనూ కొందరికి సాయం చేశారు. ఇందుకోసం భారీగా డబ్బులు ఖర్చు పెట్టిన సోనుసూద్... ముంబైలోని తన ప్రాపర్టీస్ అమ్మేశాడని చెబుతున్నారు. అందుకే ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఈ రియల్ హీరో కు అభిమానులున్నారు. సిద్ధిపేట జిల్లా దుబ్బ తండా గ్రామస్తులు ఏకంగా సోనుసూద్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయం నిర్మించారు.
.jpg)
తాజాగా ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ముష్టికుంట్ల గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ పాండురంగ నవీన్, త్రివేణి దంపతులు తమ కుమారుడికి సోనుసూద్ పేరు పెట్టుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా సోనుకు తెలిపిన వారు.. కుమారుడి ‘అన్న ప్రాసన’ కార్యక్రమానికి ఆహ్వానించారు. లాక్ డౌన్ సమయంలో సోను మానవతా దృక్పథంలో చేసిన సహాయ కార్యక్రమాలు దేశమంతా ప్రశంసలు అందుకోగా..ఆ మహానుభావుడి పేరు తమ కుమారుడికి పెట్టుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు డాక్టర్ పాండురంగ దంపతులు.


