TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఖమ్మంలో రూ.146 కోట్లు దోచుకున్న మద్యం వ్యాపారులు

Published on: Sat Feb 25, 2012 3:01PM

ఖమ్మం జిల్లా: ఖమ్మం జిల్లాలోని మద్యం వ్యాపారులు ఎమ్మార్పీ ధరపై 40శాతం అధిక రేటుకు మద్యాన్ని విక్రయించి ఏడాదికాలంగా రూ.146 కోట్లు దోచుకున్నారు. ఖమ్మంజిల్లాలో 153 వైన్ షాపులు, 44 బార్లు, 3 క్లబ్బులు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు సుమారు కోటి రూపాయల విలువైన  మద్యాన్ని విక్రయిస్తారు. అంటే సంవత్సరానికి రూ.360 కోట్ల విలువైన మద్యాన్ని విక్రయిస్తున్నారన్న మాట. ఎమ్మార్పికంటే 40శాతం అదనంగా మందుబాబుల నుంచి పీడించి తీసుకున్న సొమ్ము విలువ సుమారు రూ.146 కోట్లు. ఇలా దోపిడీ చేసిన రూ.146 కోట్లలో కేవలం రూ.17 కోట్లు ముడుపుల కింద ఖర్చు చేస్తున్నారు. ఈ 17 కోట్లలో రూ.10 కోట్లు రాజకీయ నాయకులకు, 4.5 కోట్లు ఎక్సైజ్ అధికారులకు, 2.5 కోట్లు పోలీసు అధికారులకు అందజేశారు.


జిల్లాలోని 13 సిండికెట్ కార్యాలయాల నుంచి ఆయా పరిధిలోని డిఎస్పీకి ప్రతి షాపుకు నెలకు రూ.1500 చొప్పున (ఆయన పరిధిలో 30 షాపులుంటాయి), సిఐకి నెలకు రూ.3000లు (10 షాపులు), ఎస్సైకి రూ.2000 (రెండు లేదా మూడు షాపులు), స్టేషన్ పరిధిలోని బెల్టు షాపుల నుంచి నెలకు రూ.15వేల చొప్పున ముడుపులు అందాయి. ఇక ఎక్సైజ్ శాఖ డిప్యూటి కమీషనర్ కు జిల్లాలోని అన్ని షాపులనుంచి షాపుకు రూ.3000 చొప్పున జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కు షాపుకు రూ.2000 చొప్పున, సిఐకి నెలకు రూ.5000లు, కానిస్టేబుళ్ళకు నెలకు రూ.2000 చొప్పున ముడుపులు అందాయి. రూ.146 కోట్ల అదనపు వసూళ్ళలో రూ.17 కోట్లు మాత్రమే మద్యం వ్యాపారులు ముడుపులుగా చెల్లించి మిగిలిన మొత్తాన్ని స్వాహా చేశారు.