TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి

Published on: Tue May 26, 2026 10:33AM

మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేసు దర్యాప్తులో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.  ఈ కేసులో డ్రగ్స్ సరఫరాకు సంబంధించిన మూడు మార్గాలను సిట్ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. అలాగే పలువురు డ్రగ్స్ సప్లయర్లను కూడా   గుర్తించారు. కేసు వెలుగులోకి వచ్చిన వెంటనే అభిషేక్ సింగ్, రాకేష్ వర్మ పరారయ్యారు. అనంతరం ఇద్దరూ హైకోర్టును ఆశ్రయించి అరెస్టు కాకుండా ఉత్తర్వులు పొంది. కోర్టు ఆదేశాల మేరకు సిట్ ముందు విచారణకు హాజరయ్యారు.

హైదరాబాద్ బహదూర్‌పురాలో బ్యాటరీ వ్యాపారం నిర్వహిస్తున్న రాకేష్ వర్మకు ముంబైకి చెందిన  మజార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడినట్లు విచారణలో వెల్లడైంది. ఈ పరిచయంతోనే గత డిసెంబర్‌లో మజార్ వద్ద నుంచి కోకైన్ కొనుగోలు చేసినట్లు రాకేష్ వర్మ సిట్‌కు తెలిపినట్టు సమాచారం. అలాగే ఆ డ్రగ్స్‌లో కొంత భాగాన్ని కౌశిక్ రవికి అందించినట్లు కూడా విచారణలో వెల్లడించినట్టు తెలిసింది. ఇక తన ఇంటికి ఇంటీరియర్ పనులు చేయడం ద్వారా అభిషేక్ సింగ్‌తో పరిచయం ఏర్పడిందని రాకేష్ వర్మ పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే రోహిత్ రెడ్డి పార్టీకి ముందు అభిషేక్ సింగ్‌కు ఒక పార్సిల్ ఇచ్చినట్లు సిట్ గుర్తించింది.

ఈ కేసులో గోవా నుంచి ఎండిఎంఏ డ్రగ్స్ సరఫరా చేసినట్లు భావిస్తున్న క్లింటన్ ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. పార్టీ జరుగుతున్న సమయంలో పోలీసులు అక్కడికి చేరుకోగా నమిత్ శర్మ  కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్నారు. అతని చేతులకు గన్‌పౌడర్ ఆనవాళ్లు పాజిటివ్‌గా వచ్చినట్లు ఫోరెన్సిక్ పరీక్షల్లో గుర్తించినట్టు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన ముగ్గురు వ్యక్తులు ప్రస్తుతం బెయిల్‌పై విడుదలయ్యారు.