TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేతన్ అగర్వాల్ మర్డర్ మిస్టరీ వెనుక విస్తుపోయే నిజాలు!

Published on: Fri Jun 26, 2026 2:29PM

 

మహారాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణే పారిశ్రామికవేత్త కేతన్ విశాల్ అగర్వాల్ మరణం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తొలుత లోనావాలా సమీపంలోని లోహగఢ్ కోట వద్ద ప్రమాదవశాత్తూ లోయలో పడి చనిపోయాడని భావించిన ఈ ఘటన, పోలీసుల లోతైన దర్యాప్తులో పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన ఘోర హత్యగా తేలింది. పింప్రి చించ్వాడ్‌కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమారుడైన కేతన్‌ను, అతడి కాబోయే భార్య సియా గోయల్ తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి కుట్రపూరితంగా 400 అడుగుల లోతైన లోయలోకి తోసి చంపేసిందని పుణే రూరల్ పోలీసులు వెల్లడించారు. 

ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లి, ఇటీవలె తిరిగివచ్చిన కేతన్ అగర్వాల్‌కు సియా గోయల్‌తో నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది నవంబర్ 25న వివాహం జరిపించేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉన్న ఒక ప్రసిద్ధ ప్యాలెస్‌ను ఏకంగా రూ. 17 కోట్ల భారీ వ్యయంతో పెళ్లి కోసం బుక్ చేశారు. అంతేకాదు, వీఐపీ అతిథుల ప్రయాణం కోసం రెండు ప్రైవేట్ విమానాలను కూడా సిద్ధం చేశారు. అయితే, ఇంతలోనే ఈ దారుణం జరగడం ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.  

పోలీసుల ప్రాథమిక విచారణలో సియా గోయల్ చెప్పిన సమాధానాలు అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి. కేతన్ పెట్టుకునే విగ్, అతని నత్తిగా మాట్లాడే అలవాటు (stammering) తనకు అస్సలు నచ్చలేదని సియా విచారణలో పేర్కొంది. అయితే నేరుగా పెళ్లి వద్దని చెబితే కుటుంబాల మధ్య ఉన్న కోట్ల రూపాయల బిజినెస్ డీల్స్ దెబ్బతింటాయని, అలాగే సమాజంలో తల్లిదండ్రుల పరువు పోతుందని ఆమె భయపడింది. తన కుటుంబానికి మానసిక వేదన మిగల్చడం కంటే, కేతన్‌ను పూర్తిగా లైఫ్ నుంచి తొలగించడమే సులువైన మార్గమని భావించినట్లు సియా పోలీసులకు తెలిపింది. 

ఈ క్రమంలోనే ఆమె జూన్ 19న తన పుట్టినరోజు వేడుకల నెపంతో, దానికి ఒకరోజు ముందు అంటే జూన్ 18న కేతన్‌ను బలవంతంగా లోహగడ్ కోట ట్రెకింగ్‌కు పిలిపించింది. నిజానికి జూన్ 14న కూడా ఆమె కేతన్‌ను అక్కడికి తీసుకెళ్లి లోయలోకి తోసేయాలని ప్రయత్నించగా, ఒక చెట్టు అడ్డుపడటంతో కేతన్ ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పుడు పామును చూసి భయపడి నెట్టేసానంటూ సియా కట్టుకథ అల్లింది. ఎలాగైనా కేతన్‌ను వదిలించుకోవాలని డిసైడ్ అయిన సియా, జూన్ 18న మరోసారి అతడిని అక్కడికి తీసుకెళ్లి, ఫోటోలు దిగుతున్న సమయంలో తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి 400 అడుగుల లోతైన లోయలోకి నెట్టేసింది.  

కేతన్ అనుభవజ్ఞుడైన ట్రెక్కర్ కావడంతో అతడు అంత తేలిగ్గా జారిపడే అవకాశం లేదని కుటుంబ సభ్యులు లోనావాలా రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు కథ బయటకు వచ్చింది. టెక్నికల్ ఎవిడెన్స్ దొరకకుండా ఉండేందుకు సియా, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి పక్కాగా స్కెచ్ వేశారు. చేతన్ చౌదరి తన లొకేషన్ ట్రేస్ కాకుండా ఉండేందుకు కొంధ్వాలోని తన నివాసంలోనే మొబైల్ ఫోన్‌ను వదిలి వెళ్లాడు. 

అయినప్పటికీ దర్యాప్తులో వారి మధ్య దాదాపు 2,000 కాల్స్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే జూన్ 18న లోనావాలాలో 33 డిగ్రీల సెల్సియస్ ఎండ తీవ్రత ఉన్నప్పటికీ, కోట కింద ఉన్న సీసీటీవీ ఫుటేజీలో ఒక వ్యక్తి తలకు క్యాప్ ఉన్న హుడీ టీషర్ట్ వేసుకుని, హెడ్‌ఫోన్స్ పెట్టుకుని అనుమానాస్పదంగా తిరగడం పోలీసుల కంటపడింది. అంతటి ఎండలో అలాంటి దుస్తులు ధరించడం వెనుక గుర్తింపు దాచాలనే కుట్ర ఉందని భావించిన పోలీసులు ఆ దిశగా విచారణ జరపగా, ఆ హుడీ ధరించిన వ్యక్తి చేతన్ చౌదరి అని తేలింది. సియా గోయల్ వేసిన ఈ వికృత మైండ్ గేమ్ మరియు అహంకారం చివరకు ఆమెను, ఆమె ప్రియుడిని కటకటాల వెనక్కి నెట్టింది.