కేకే ఓటమి ఖాయమా?

 

 

 

పాపం కే.కేశవరావుకి ఒక వీక్నెస్ వుంది. ఆయన ఎప్పుడూ ఏదో ఒకపదవిలో వుండాలి. లేకపోతే ఆయనకి ఊపిరి ఆడదు. దాంతో ఆయన ఏ పార్టీలోవుంటే ఆ పార్టీలో వాళ్ళకి ఊపిరి ఆడకుండా చేస్తూ వుంటారు. కాంగ్రెస్ పార్టీ ఆయన్ని ఒకసారి రాజ్యసభకి పంపించింది. రెండోసారి రాజ్యసభకు పంపకపోవడంతో అలిగిన ఆయన తెలంగాణ ఉద్యమంలో మరోసారి ఒక్క ఉదుటున దూకేశారు. కాంగ్రెస్ పార్టీలో వుంటూనే ఉద్యమం పేరు చెప్పి బోలెడన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు. తన ధాటికి కాంగ్రెస్ అధిష్ఠానం బెదిరిపోయి తనను మళ్ళీ ఏ రాజ్యసభకో పంపిస్తుందని ఎదురు చూసిన ఆయనకు ఆ అవకాశం దక్కలేదు.

 

ఇక కాంగ్రెస్ అధిష్ఠానం తన బెదిరింపులకు లొంగే అవకాశం లేదని స్పష్టంగా అర్థం చేసుకున్న ఆయన ఓ ఫైన్ మార్నింగ్ టీఆర్ఎస్ లోకి జంప్ జిలానీ అయ్యారు. ఆయన పార్టీ వదిలిపోయినందుకు కాంగ్రెస్ పార్టీ ఎంతమాత్రం ఫీలవకుండా ప్రశాంతంగా వుంది. తాజాగా రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఆరు స్థానాలు ఖాళీ కావడంతో కేకే గారికి మళ్ళీ రాజ్యసభ మీద మోజు మొగ్గ తొడిగింది. గెలిచే అవకాశం లేదని తెలుస్తూనే వున్నా ఆయన రాజ్యసభకు పోటీ చేయాలని ముచ్చటపడ్డారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల్లో తనకాళ్ళమీద పడేవాళ్ళు చాలామంది వున్నారని, వాళ్ళు తనకు తప్పకుండా ఓటేస్తారని కేకే నమ్మకం పెట్టుకున్నారు. ఈ పాయింట్‌ని సాకుగా చూపించి టీఆర్ఎస్ తరఫున రాజ్యసభ బరిలో నిలబడటానికి కేసీఆర్‌ని ఒప్పించారు. ఈయన కోరికను కాదంటే మళ్ళీ పార్టీ వదిలి ఎక్కడ వెళ్ళిపోతారని అనుకున్నారో లేదా ఆయన మోజుని ఎందుకు కాదనాలని అనుకున్నారోగానీ కేసీఆర్ కేకేని తమ పార్టీ తరఫున రాజ్యసభ బరిలో నిలబెట్టారు.




అప్పటి నుంచి కేకే కాలికి బలపం కట్టుకుని కాంగ్రెస్, సీపీఐ, మజ్లిస్ పార్టీల మద్దతు కూడగట్టుకోవడానికి తిరుగుతున్నారు. అయితే కేకే ఎన్ని తంటాలు పడినా ఆయన గెలిచే అవకాశాలు లేవని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. స్వతంత్ర్య అభ్యర్థులుగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ నాయకులు చైతన్యరాజు, ఆదాల ప్రభాకరరెడ్డిలో ఎవరో ఒకరు గెలిచే అవకాశమే వుందని అంటున్నారు. ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటు వైసీపీ ఎమ్మెల్యేలు ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి ఓటు వేసే అవకాశం వుందని అంటున్నారు. అది కూడా కేంద్రమంత్రి పల్లంరాజు ఆశీస్సులు దండిగా వున్న చైతన్యరాజుకే ఎక్కువ ఛాన్స్ వుందని భావిస్తున్నారు. కేకేకి ఓటమి తప్పదని ఊహిస్తున్నారు.