కేరళ విలయం ఏం నేర్పింది

కేరళ కళ తప్పింది. దేవుడి రాష్ట్రం రాక్షస రాజ్యంగా మారంది. ఎక్కడ చూసినా నీళ్లూ... ప్రజల కన్నీళ్లూ తప్ప మరింకేం లేవు. లక్షలాది ఇళ్లు కూలిపోయాయి. వందల సంఖ్యలో ప్రజలు మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పంటలు లేవు. వారికి ఆదాయాన్ని తెచ్చి పెట్టే పర్యాటకం బంద్ అయ్యింది. తమ రాష్ట్రాన్ని చూసి మురిసిపోయే వారిని, అక్కడికి వెళ్లి సేద తీరే వారిని కొన్నాళ్ల పాటు రావద్దంటూ ఆ రాష్ట్ర వేడుకుంది. నష్టం భారీగానే ఉంది. వేదన తీరనిదిగానే ఉంది. శరణార్ధి శిబిరాల నుంచి ఒక్కొక్కరే ఇళ‌్లకు చేరుకుంటున్నారు. ఇంటి ముందు ఇంతకు ముందు కళకళలాడుతూ తిరిగిన... బిలబిలాడుతూ పరుగిడిన మూగజీవాలు విగత జీవులయ్యాయి. గుంజకు కట్టిన పశువులు ఆ గుంజలకే వెల్లాడుతూ మోకాల్లోతు నీళ‌్లలో కళేబరాల్లా మిగిలాయి.

 

 

ఇది దారుణ ద్రశ్యం. ఇది దారుణ విలయం. ఇది దారుణ శోకం. ఇది దౌర్భాగ్యం. ఈ ద్రశ్యానికి... ఈ విలయానికి.... ఈ శోకానికి... ఈ దౌర్భాగ్యానికి అక్కడి ప్రజలు ప్రభుత్వాన్ని నిందించడం లేదు. ఇది ప్రభుత్వ తప్పిదంలా కూడా కనిపించడం లేదు. ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం మహా నాయకుడు మావో అన్నట్లు ప్రక్రతి మానవునిపై చేసిన యుద్ధం. ప్రక్రతి మానవునిపై ఎక్కుపెట్టిన బాణం. దీనికి కారణం మనుషులే. మనం భవిష్యత్ అభివ్రద్ధి పేరుతో చేస్తున్న వినాశనం, చేసుకుంటున్న విధ్వంసం ఫలాలు నేడు అనుభవించాల్సి వస్తోంది.  పర్యావరణ వేత్తలు మొత్తుకుంటున్నారు... పర్యావరణవేత్తలు వేడుకుంటున్నారు. అలా చేయకండి... ఇలా నాశనం చేయకండి... అంటూ మొరపెట్టుకుంటున్నారు. అయినా మనం వినడం లేదు. వారి మాటలు మన చెవికెక్కడం లేదు. మనం వినే స్థితిలో లేం. ఆచరించే పనిలో లేం. పర్యావరణ పరిరక్షణ అంటే దాని కోసం టెన్‌కె రన్‌లు, మానవ హారాలు తీయడం అనుకుంటున్నాం. ఎప్పుడో ఏడాదికొకసారి పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుని ఆ రోజు మొక్కుల నాటుతాం. ఆ రోజు వాటికి నీళ్లు పోస్తాం. ఆ రోజు ప్లకార్డులు పట్టుకుని వీరావేశంతో ప్రతిన బూనుతాం.

 

 

మన ముఖ్యమంత్రులు, మంత్రులు, ఉన్నతాధికారులు, కొండకచో సినీ అందాల తారలు చేతులు ఊపుతూ పర్యావరణ పరిరక్షణే మన ధ్యేయం అని మన చేత ప్రమాణం చేయిస్తారు. వాళ్లూ చేస్తారు. మళ్లీ యథా ప్రకారం ఆ మర్నాడు... అంతెందుకు ఆ రోజే దాన్ని మరచిపోతాం. మళ్లీ ఇదిగో ఇలా విలయం వచ్చినప్పుడు విలవిల్లాడిపోతాం. ఇది మన నైజం. ఇదీ మన రూపం. ఇదీ మన భాధ్యత. కేరళ బాధితులకు దేశవ్యాప్తంగా ఇబ్బడి ముబ్బడిగా విరాళాలు వస్తున్నాయి. తమకు చేతనైన సాయం ఎవరికి వారు చేస్తున్నారు. ఇది మానవత్వం ఇంకా మిగిలి ఉంది అనడానికి ఓ నిదర్శనం. వేల కోట్ల రూపాయల నష్టాన్ని ఏ ఒక్కరో పూడ్చలేరు. అందరూ కలిసినట్టుగా... సమష్టిగా చేయాల్సిన పని. బాధ్యత. అయితే, సాయం చేయడమంటే తాము కొన్నాళ్లు వాడి ఇంట్లో పక్కన పడేసిన దుస్తులు కాదు. తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది దుస్తులు, అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు, ఇతర పరికరాలు ఇస్తున్నారు. ఇవి వారికి పనికి రావని కాదు. ఇవి వారికి అక్కరకు వచ్చేవి కావని కూడా కాదు. కేరళ వాసుల ఇళ్లు కొట్టుకుపోలేదు. వారి ఇళ్లలోకి నీరు చేరి వారి వస్తువులు తడిసిపోయాయి. అంతే జరిగింది. కేరళ పేద రాష్ట్రం ఏమీ కాదు.

 

 

ఆ మాట కొస్తే దక్షిశాదిలో... మరీ ముఖ్యంగా దేశంలోనే అత్యంత సంపన్న రాష్ట్రం. వారికి నిలదొక్కుకునేందుకు కాసింత సమయం కావాలి అంతే. దానికి వరుణుడు కరుణించాలి. పర్యాటకం ఊపందుకోవాలి. ఈ రెండు జరగడానికి ఎక్కువ రోజలేం పట్టదు. ఈలోగా వారికి కావాల్సింది పాతబడిపోయిన బట్టలు.... ముక్కిపోయిన బియ్యం... పెట్టెల కొద్దీ అగ్గిపెట్టెలు, టన్నుల కొద్దీ కొవ్వొత్తులు కాదు. వారికేం కావాలో వారే అడుగుతున్నారు. వారే వినమ్రంగా కోరుతున్నారు. వారికి మనిషి సాయం కావాలి. స్వచ్చంధంగా పని చేసే ఎలక్ట్రిక్ పని వారు కావాలి. వడ్రంగులు కావాలి. పెయింటర్లు కావాలి. మరీ ముఖ్యంగా వానలు, వరదల కారణంగా వ్యాధులు ప్రభలకుండా ఉండేందుకు... ఇప్పటికే వచ్చిన వ్యాధులకు చికిత్స చేసేందుకు డాక్టర్లు కావాలి. ఇవన్నీ కావాలని అక్కడి ప్రజలు సోషల్ మీడియా ద్వారా అభ్యర్ధిస్తున్నారు.  తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వందలాది మంది ఎలక్ట్రిక్ పనివారిని, వడ్రంగులను, పెయింటర్లను, డాక్టర్లను ఇక్కడి ప్రభుత్వాలు గుర్తించి అక్కడికి పంపితే అదే వారికి కోట్లాది రూపాయల సాయం చేసినట్లు.ఈ దిశగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ కార్యచరణ ప్రారంభిస్తే అంతకు మించిన మేలు లేదు.