విద్యార్థినికి అండగా కేరళ సీఎం

కేరళలోని ఎర్నాకుళం ప్రాంతానికి చెందిన 21ఏళ్ల హనన్‌ స్థానిక ప్రైవేటు కళాశాలలో బీఎస్సీ చదువుతోంది. హనన్‌ చిన్నతనంలోనే ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. తండ్రి మద్యానికి బానిసవడం, తల్లి మానసికంగా కుంగిపోవడంతో చిన్పప్పటి నుంచే ఆర్థిక కష్టాలను ఎదుర్కొంది హనన్‌. దీంతో ఇంటి బాధ్యతలు తానే తీసుకుంది. కానీ ఇన్ని కష్టాల్లోనూ చదువును మాత్రం వదిలిపెట్టలేదు.

 

 

చిన్నచిన్న పనులు చేసుకుంటూ చదువుకుంటోంది. అలా ప్రస్తుతం ఇల్లు గడవడం కోసం కాలేజీ అయిపోయిన తర్వాత చేపలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. రోజూ ఉదయాన్నే కాలేజీకి వెళ్లడం.. కాలేజీ పూర్తయిన తర్వాత హోల్‌సేల్‌ మార్కెట్‌కు వెళ్లి చేపలు తెచ్చుకుని వాటిని వీధుల్లో అమ్మడం ఇది హనన్‌ దినచర్య. హృదయాలను హత్తుకునేలా ఉన్న ఆమె కథ ఇటీవల సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్టును చూసిన కొందరు ఆమెను అభినందిస్తుంటే.. మరికొందరు ఇదంతా నిజం కాదని, ప్రచారం కోసమే ఈ కథను సృష్టించారని సోషల్‌మీడియాలో విమర్శిస్తున్నారు. అయితే ఈ విమర్శలను హనన్‌ కాలేజీ యాజమాన్యం కూడా కొట్టిపారేసింది. కేంద్రమంత్రి కేజే ఆల్ఫోన్స్‌ కూడా దీనిపై స్పందిస్తూ ఆమెకు మద్దతుగా నిలిచారు. ఈ పరిణామాలను ముఖ్యమంత్రి పినరయి విజయన్ గమనించారు. ఇటువంటి ప్రచారాలకు భయపడకుండా హనన్ తన కార్యక్రమాలను కొనసాగించాలని, యావత్తు కేరళ ఆమెకు మద్దతుగా నిలుస్తుందని చెప్పారు.

 

 

ఆమెకు రక్షణ కల్పించాలని ఎర్నాకుళం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.ఆమెను వేధిస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ‘‘ఓ విద్యార్థి తన కాళ్ళపై తాను నిలబడటం ఎంతో గర్వించదగిన విషయం. తాను సంపాదించిన సొమ్మును తన చదువు కోసం ఖర్చు చేయడంలో కలిగే సంతృప్తి చాలా గొప్పది. జీవితంలో అలాంటి అనుభవాలను పొందినవారు మాత్రమే దీనిని అర్థం చేసుకోగలుగుతారు’’ అని పినరయి విజయన్ అన్నారు.